అమరావతి నిర్మాణాలపై రోజుకో రకంగా మాట్లాడుతున్న మంత్రి బొత్స సత్యనారాయణను.. టీడీపీ నేతలు జోకర్‌గా తేల్చేశారు. అమరావతిలో ఇటుక కూడా పెట్టలేదని.. అక్కడేమీ లేవని.. ఆపడానికి అసలేమీ కట్టడాలు అక్కడ నిర్మాణంలో లేవని బొత్స సత్యనారాయణ చెబుతూండటంపై… టీడీపీ నేతలు మండిపడ్డారు. మీడియాను తీసుకుని అమరావతిలో పర్యటించారు. నిర్మాణంలో ఉన్న భవనాలన్నింటినీ పరిశీలించారు. తొంభై శాతం పూర్తయిన ఎమ్మెల్యేల ఇళ్లు, ఇతర నివాసాలను పరిశీలించారు. జగన్ సొంత ఇంటి కంటే క్వాలిటీగా నిర్మాణాలు ఉన్నాయని… 60 రోజుల్లో పూర్తి అయ్యే నిర్మాణాలను నిలిపివేశారని.. టీడీపీ నేతలు మండిపడ్డారు. శాడిస్ట్ ఆలోచనతో నిర్మాణాలు ఆపేశారని .. మంత్రి బొత్స లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతిలో అవినీతి అన్నారు…ఏం తేల్చారని ప్రశ్నించారు. అమరావతి పేరు చెపితే చంద్రబాబు గుర్తొస్తారని నిర్మాణాలు ఆపేశారని మండిపడ్డారు.
పురపాలక మంత్రిగా బొత్స మొదట్లో బాధ్యతలు చేపట్టినప్పుడు.. అమరావతి ఆగదని.. టీడీపీ కన్నా వేగంగా పూర్తి చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత తన విధానాన్ని మార్చుకున్నారు. అమరావతిపై రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. వరద వస్తే మునుగుతుంది.. ఖర్చు ఎక్కువని.. ఓ వాదన తీసుకొచ్చారు. అలాగే.. రాజధాని ఓ సామాజికవర్గానిదేనని.. ఓ సామాజికవర్గం కోసం.. తాము రాజధాని కట్టబోమంటూ.. ప్రకటనలు చేస్తున్నారు. అవినీతి ఆరోపణలు కూడా చేశారు. అయితే..ఇదే బొత్స.. కొద్ది రోజుల కిందట..అమరావతిలో రూ. తొమ్మిది వేల కోట్ల పనులు జరుగుతూండగా.. రూ. ఐదు వేల కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయని చెప్పుకొచ్చారు. మళ్లీ ఏమనుకున్నారో కానీ.. అక్కడ పూర్తి చేయడానికి నిర్మాణంలో ఏమీ లేవని.. చెబుతున్నారు. ఇలా రోజుకో మాట చెబుతూండటం… ప్రభుత్వం రాజధానిపై సృష్టిస్తున్న గందరగోళంలో ఓ వ్యూహమని అంటున్నారు.
మరో వైపు… కొత్త రాజధాని ఎంపిక కోసం అని నేరుగా చెప్పుకుండా.. ఓ కమిటీని ప్రభుత్వం నియమించింది. తాజాగా ఆ కమిటీకి ఓ కన్సల్టెంట్‌ను కూడా.. రూ. లక్షన్నర జీతం ఇచ్చి అపాయింట్ చేశారు. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారమే.. తాము రాజధానిని ఎంపిక చేస్తామంటూ.. బొత్స చెప్పుకొస్తున్నారు. ప్రభుత్వానికి రాజధానిని మార్చే వ్యూహం ఉంది కాబట్టే… ఇలా చేస్తున్నారని… టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. అందుకే… రాజధానిలో పర్యటించి.. ప్రజల ముందు వాస్తవాలుంచాలని నిర్ణయించారు.