ఆర్ధిక అంశాలలో ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్ర ప్రభుత్వం ఇదే వైఖరి కొనసాగిస్తే తెలుగుదేశం, బిజెపిల మధ్య పొత్తు అనుమానమే! ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. సోమవారం రాజమహేంద్రవరంలో నియోజకవర్గ పార్టీ విస్తృత సమావేశంలో, పార్లమెంటు సభ్యుడు మాగంటి మురళీ మోహన్ సమక్షంలో బుచ్చయ్య చౌదరి ఈ వ్యాఖ్యానం చేశారు.
ఇది ఆవేశంనుంచి వచ్చిన మాటగానో, కార్యకర్తల్ని ఉత్తేజపరచడానికి చేసిన ఉపన్యాసంగానో అనుకోవడానికి వీల్లేదు. రెండు పార్టీల తెగతెంపులకు కార్యకర్తల ఆమోదం పొందడాననికీ, కార్యకర్తల, ప్రజల స్పందన ఎలా వుంటుందో బేరీజు వేసుకోడానికి తెలుగుదేశం పార్టీ ఉద్దేశ్యపూర్వకంగానే వొదిలిపెట్టిన ఫీలర్ గానే భావించాలి.
రాజధాని నిర్మాణానికి నిధులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు, రెవిన్యూలోటును పూరించే నిధులను విభజన చట్టం ప్రకారం కేంద్రమే ఇవ్వాలి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి పదేళ్ళ పాటు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్రతిపత్తి హోదా ఇవ్వగలమని విభజన సందర్భంగా వెంకయ్య నాయుడు రాజ్యసభలో చెప్పారు. తిరుపతి ఎన్నికల సభలో ”ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పెద్ద కొడుకునై నిలుస్తా”నని నరేంద్రమోదీ మాట ఇచ్చారు. హామీలను గాలికి వొదిలేసినా కూడా, చట్ట ప్రకారం చేయవలసిన సాయాన్ని కూడా కేంద్రం చేయడం లేదు. రొటీన్ గా వచ్చిన, రావలసి వున్న సహాయాల చిట్టా చదివేసి, ఇదంతా ఆంధ్రప్రదేశ్ ఉద్దరణేనని బిజెపి పెద్దలు సభలు పెట్టి వెళ్ళిపోతున్నారు.
మరోవైపు బిజెపిలో కొందరు పెద్ద నాయకులు తెలుగుదేశంతో కలిసి వున్నంత వరకూ బిజెపి ఎదగజాలదని బాహాటంగానే విసుక్కుంటున్నారు.
అన్నిటికీ మించి సహాయం చేస్తామని చెప్పడమే తప్ప ఎప్పుడు చేస్తారో చెప్పకుండా కేంద్రం కాలయాపన చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే డిల్లీ వెళ్ళి కేంద్రమంత్రులకు మహజర్లు పెట్టుకోవడం వారు తప్పకుండా అని నమ్మబలకడం మామూలైపోయింది.
చాలీచాలని కేంద్రసాయాన్ని పెంచాలని రాష్ట్రకేబినెట్ కేంద్రాన్ని కోరడం మినహా ఇటువైపు నుంచి కేంద్రం మీద ఎలాంటి వత్తిడీ లేదు. కేంద్రంలో భాగస్వామిగా వున్నప్పటికీ ఏ మాటా చెల్లకపోవడం తెలుగుదేశానికి అవమానకరంగానే వుంది. రాష్ట్రప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని నిస్సహాయతతో రాష్ట్రప్రభుత్వం రెండేళ్ళు కాలం గడిపేసింది. తెలుగుదేశం మీద బిజెపికి ఏవిధమైన ఆసక్తీ లేదని గ్రహించేశాక తనమీద నింద పడని విధంగా బయటపడాలని తెలుగుదేశం ఒక వ్యూహం ప్రకారం అడుగులు వేస్తున్నట్టు అర్ధమౌతోంది.
తెలుగుదేశం అధ్యక్షుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుగా పిడుగురాళ్ళ సభలో, తరువాత విశాఖసభలో కేంద్రం వైఖరిని ప్రస్తావిస్తూ ”ఇలాగైతే కష్టమే” అన్నధోరణిలో మాట్లాడారు. ఇపుడు పార్టీలో చంద్రబాబుకంటే సీనియర్ నాయకుడైన ప్రధాన కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమహేంద్రవరంలో ఇంకో ముందడుగు వేసి ”ఇలాగైతే కుదరదు” అన్న స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చారు.