గత ఏడాది హైదరాబాద్ లో జరిగిన మాహానాడు సమావేశాలలో తెదేపాను జాతీయ పార్టీగా మార్చాలని నిర్ణయం తీసుకొని అందుకు అనుగుణంగా, పార్టీలో మార్పులు, చేర్పులు చేశారు. కానీ తెలంగాణాలో చాలా బలంగా ఉన్న తెదేపా తెరాస ఆకర్శ కారణంగా, ఓటుకి నోటు కేసు దెబ్బకి తెలంగాణాలో క్రమంగా తుడిచిపెట్టుకుపోసాగింది. అయినప్పటికీ, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దానిని కాపాడుకొనే ప్రయత్నం చేయకపోగా, దానికి ఇంకా దూరం జరిగారు. ఆ కారణంగా తెలంగాణాలో తెదేపా ఇంకా వేగంగా బలహీనపడింది. తెలంగాణాలో తెదేపా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక్కరే ప్రముఖంగా కనబడుతున్నారు. పార్టీలో మిగిలిన నేతలు ఏమి చేస్తున్నారో తెలియదు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణాలో తెదేపా ఉంటుందో పూర్తిగా కనబడకుండా మాయమైపోతుందో కూడా చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది.
చాలా బలంగా ఉన్న తెలంగాణాలోనే పార్టీని కాపాడుకోలేనప్పుడు, అసలు తెదేపా ఉనికే లేని కర్నాటక, తమిళనాడు, ఓడిశా,మహారాష్ట్రా వంటి ఇతర రాష్ట్రాలకు పార్టీని విస్తరించి, అక్కడ బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను డ్డీకొనడం ఊహించలేని విషయం. కానీ నిన్నటితో ముగిసిన మాహానాడు సమావేశాలలో తెదేపా ప్రవేశ పెట్టి ఆమోదించిన చివరి తీర్మానం అదే. వచ్చే ఎన్నికలలోగా తెదేపాను ఇరుగు పొరుగు రాష్ట్రాలకు విస్తరించి జాతీయ పార్టీ హోదా సాధించాలని తీర్మానం ఆమోదించారు.
గత ఏడాదే తెదేపా ఆ నిర్ణయం తీసుకొంది కనుక దానికి నిజంగా అటువంటి ఆసక్తి ఉండి ఉంటే మొన్న జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికలు తెదేపా ఒక మంచి అవకాశం కల్పించాయి. తమిళనాడులో తెలుగువారు అధికంగా ఉండే ప్రాంతాలలో పోటీ చేయాలని ఒక తెలుగు సినీ నిర్మాత చంద్రబాబుని కోరినప్పటికీ, ఆయన పట్టించుకోలేదు. కనీసం ఆ నిర్మాతకి తెదేపా మద్దతు కూడా ఇవ్వలేదు. ఆయన పోటీ చేశారు కానీ ఓడిపోయారు. అది వేరే సంగతి. కానీ తెదేపాను ఇరుగు పొరుగు రాష్ట్రాలకు విస్తరించే అవకాశాన్ని చంద్రబాబు చేజేతులా వదులుకొన్నారని అది స్పష్టం చేస్తోంది.
తెలంగాణాలో పార్టీని పట్టించుకోనప్పుడు, ఎన్నికలలో పోటీ చేసే అవకాశాన్ని వదులుకొంటున్నప్పుడు, తెదేపాను జాతీయపార్టీగా ఎదిగేందుకు కృషి చేయాలని మళ్ళీ మళ్ళీ తీర్మానాలు చేసి ఏమి ప్రయోజనం? మరో రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క ఎంపి సీటు సాధిస్తే తెదేపాకి జాతీయహోదా వస్తుందని నిన్న మహానాడులో అనుకొన్నారు. అంటే వారి ఉద్దేశ్యం తెదేపాకి జాతీయహోదా స్టాంప్ వేయించుకోవడమే తప్ప పార్టీని విస్తరించడం కాదని అనుమానించవలసి వస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి తెదేపా, భాజపాలు తెగతెంపులు చేసుకొన్నట్లయితే, చంద్రబాబు నాయుడు మూడవ కూటమితో చేతులు కలిపి జాతీయ స్థాయి రాజకీయాలలో పాల్గొనాలని ఆశిస్తున్నారు కనుకనే పార్టీకి జాతీయహోదా ముద్ర అవసరమని భావిస్తున్నారేమో? కానీ అది ఉట్టికి ఎగురలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లు ఉంటుంది.
తెదేపాకు అటువంటి పెద్దపెద్ద ఆలోచనలు, కోరికలు ఉన్నట్లయితే, అది మొట్టమొదట చేయవలసిన పని తెలంగాణాలో పార్టీని కాపాడుకొని, వచ్చే ఎన్నికల నాటికి దానిని మళ్ళీ బలోపేతం చేసుకోవడం. కానీ ఆ పని చేయకుండా జాతీయస్థాయి పగటి కలలు కనడం వలన ప్రయోజనం ఏముంటుంది?