తుని విద్వంసానికి బాధ్యులని అనుమానిస్తున్న ఏడు మందిని సి.ఐ.డి. పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ముద్రగడ పద్మనాభం మొదట అమలాపురం పోలీస్ స్టేషన్ వద్ద మంగళవారం ధర్నా చేశారు. పోలీసులు ఆయనని బలవంతంగా ఆయన స్వస్థలం కిర్లంపూడికి తరలిస్తే, ఆ ఏడుగురిని విడుదల చేస్తున్నట్లుగా ప్రకటిస్తే కానీ పోలీస్ వ్యానులోంచి దిగనని మొండికేశారు. బుదవారం సాయంత్రంలోగా వారినందరినీ విడిచిపెట్టకపోతే, మళ్ళీ ఆమరణ నిరాహార దీక్షకి కూర్చొంటానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈసారి ఆయన బెదిరింపులకి ప్రభుత్వం భయపడకుండా ఎదురు ప్రశ్నిస్తోంది. మంత్రి గంటా శ్రీనివాస రావు మీడియాతో మాట్లాడుతూ, “పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తులు తుని విద్వంసానికి కారకులు కాదని ఆయన నమ్ముతున్నట్లయితే దానికి పాల్పడినవారెవరో ఆయనే చెప్పాలని కోరారు.
హోం మంత్రి చిన రాజప్ప కూడా చాలా తీవ్రంగానే మాట్లాడారు. “తుని విద్వంసానికి పాల్పడిన సంఘ విద్రోహ శక్తులని విడిచిపెట్టమని ముద్రగడ డిమాండ్ చేయడం మాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన డిమాండ్ చేసినంత మాత్రాన్న వారిని విడిచిపెట్టే అధికారం మాకు ఉండదు. న్యాయస్థానాలకు మాత్రమే ఆ అధికారం ఉంటుంది. కనుక ఒకవేళ ఆయన నిరసనగా నిరాహార దీక్షలు చేసుకోదలిస్తే చేసుకోవచ్చు. అది ఆయన ఇష్టం. ఈ ఘటనలతో నేరుగా సంబంధం ఉన్నవారిని పోలీసులు మొదట అరెస్ట్ చేశారు. ఒకవేళ ఆయనకి కూడా వాటితో సంబంధం ఉన్నట్లు ఆధారాలు దొరికితే పోలీసులు ఆయనని కూడా అరెస్ట్ చేస్తారు. ఎంత పెద్ద వారైనా ఎవరూ చట్టానికి అతీతులు కారని ఆయన గ్రహించాలి. ఆయన జగన్మోహన్ రెడ్డికి ఏజంటులా వ్యవహరిస్తున్నారు. జగన్ చెప్పినట్లు ఆడుతూ, మాట్లాడుతున్నారు. కాపులకి రిజర్వేషన్లు ఇవ్వడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెపుతున్నప్పుడు, దానికి ఇంకా రెండు నెలల గడువు కూడా ఉన్నప్పుడు, ఇంతలోనే ముద్రగడ ఎందుకు ఉద్యమించాలనుకొంటున్నారు? జగన్ రాజధాని నిర్మాణం జరగకుండా అడ్డుపడుతుంటే, ముద్రగడ కులాన్ని అడ్డుపెట్టుకొని రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్నారు, అని హోం మంత్రి అన్నారు.
తెదేపా మంత్రుల జవాబులు చూస్తుంటే, ఇకపై ఆయన విషయంలో ప్రభుత్వం చాలా కటినంగా ఉండబోతోందని స్పష్టం అవుతోంది. “తుని ఘటనలకు నాదే బాద్యత…ముందు నన్ను అరెస్ట్ చెయ్యండి” అని ఆయన పదేపదే చెపుతున్నప్పటికీ, రాష్ట్రంలో కాపులను నొప్పించకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఇంతవరకు వెనుకాడింది. కానీ ఇప్పుడు అవసరమైతే ఆయనని అరెస్ట్ చేయవచ్చు. అదే జరిగితే రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు తలెత్తుతాయో ఎవరూ ఊహించలేరు.