మరో ఏడాదిన్నరలో ఎన్నికలకు సిద్ధం అన్నట్టుగా కేంద్రంలోని భాజపా సర్కారు సంకేతాలు ఇస్తోంది. వీలైనన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు, లోక్ సభ ఎన్నికల్ని కూడా కలిపి ఒకేసారి నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్టుగానే ఈ మధ్య కథనాలు వస్తున్నాయి. ఇక, ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. అధికార పార్టీ టీడీపీ కూడా ఎన్నికల మూడ్ లోకి వచ్చేసింది. ఓపక్క ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్రకు సన్నాహాలు చేసుకుంటే, ఇప్పటికే ఇంటింటికీ టీడీపీ వంటి కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు నేతలు. ఇదే సందర్భంలో పొత్తుకు సంబంధించిన వ్యూహాలపై కూడా టీడీపీ కసరత్తు చేస్తోందనీ, భాజపా విషయంలో ‘ప్లాన్ బి’ కూడా టీడీపీ దగ్గర సిద్ధమైందని తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుకు భాజపా సిద్ధంగా ఉందీ అంటే.. ప్రస్తుతానికి ఎటూ తేల్చి చెప్పలేని పరిస్థితి. ఆంధ్రాలో సొంతంగా ఎదగాలనే వ్యూహంతో ఆ పార్టీ ఉంది. అలాంటప్పుడు, మరోసారి చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే రాష్ట్రంలో ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉండదు. పొత్తులో భాగంగా టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తే, అన్నిచోట్ల మాత్రమే పోటీకి అవకాశం ఉంటుంది. ఒకవేళ పొత్తు తప్పకపోతే, వీలైనన్ని ఎక్కువ స్థానాలు ఈసారి దక్కించుకోవాలనే ఆలోచన ఆ పార్టీ ఉంది. ఇక, టీడీపీ విషయానికొస్తే… భాజపాతో పొత్తు కుదిరితే గొడవే లేదు! ఒకవేళ భాజపా సొంతంగా వ్యవహరించే ప్రయత్నం చేసినా, లేదా వైకాపాతో జతకట్టే పరిస్థితి వచ్చినా, లేదా పవన్ కల్యాణ్ జనసేనను కలుపుకుని టీడీపీని దూరం పెట్టే వ్యూహాలు వేసినా.. సమర్థంగా ఎలా ఎదుర్కోవాలనే సమాలోచనలు టీడీపీ అధినాయకత్వం సమక్షంలో జరిగినట్టు చెబుతున్నారు. ఒకవేళ ఇలాంటి పరిస్థితే ఎదురైతే ఏం చెయ్యాలనేది అప్పటికప్పుడు తడుముకుని తలలు పట్టుకునే కంటే.. ఇప్పట్నుంచే ఓ ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం మేలు అనే అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నట్టు చెబుతున్నారు.
ఇంతకీ ఆ ప్రణాళిక ఏంటంటే… కేంద్రంపై సున్నితంగా విమర్శలు చేస్తూనే ఉండటం! ప్రత్యేక హోదాకు బదులుగా కేంద్రం ప్యాకేజీ ఇచ్చింది. కానీ, ఆ ప్యాకేజీలో భాగంగా రావాల్సిన నిధులను విడుదల చేయడంలో కేంద్రం తాత్సారం చేస్తోందని తాజాగా సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు బిల్లుల విషయమై కూడా కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. కేంద్రం సకాలంలో నిధులు ఇవ్వకపోతే అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం మరింత శ్రమించాల్సి వస్తుందన్నారు. రైల్వే జోన్ విషయమై కేంద్రం తేల్చాల్సి ఉందని గుర్తు చేశారు. రెవెన్యూ లోటు బర్తీ అంశాన్ని కూడా చంద్రబాబు మాట్లాడారు. ఇలా.. సందర్భానుసారంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సాయం సక్రమంగా రావడం లేదనే అంశాన్ని వార్తల్లో ఉంచాలనేది టీడీపీ వ్యూహంగా చెబుతున్నారు!
దీని ద్వారా జరిగే మేలేంటయ్యా అంటే… ఒకవేళ భాజపా పొత్తుకు నై అనేసి, టీడీపీ ఢీ అనేసిన సందర్భం వచ్చిందే అనుకోండి. అప్పటికప్పుడు భాజపా తీరుపై విమర్శలు మొదలుపెడితే… పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఇప్పట్నుంచీ భాజపా తీరుపై ప్రజల్లోకి అంతర్లీనంగా ఒక వ్యతిరేక భావన తీసుకుని పోవడం వల్ల… సమయం వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలకు కేంద్రం అనుసరించిన వైఖరే కారణం చెప్పొచ్చు. ప్రజలు కూడా సులువుగా రిసీవ్ చేసుకుంటారు కదా! సో.. ఈ విజన్ తో ఆ విధంగా ముందుకుపోయే పరిస్థితి కనిపిస్తోందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.