తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ ప్రచార వ్యూహాన్ని ఖరారు చేసుకుంది. ఎప్పటిలా అభివృద్ధి చేస్తామనో.. మరొకటో చెప్పడం లేదు. ట్రెండ్‌కు తగ్గట్లుగా.. హిందూత్వాన్ని.. హిందూ ధర్మాన్నే హైలెట్ చేసుకోవాలని నిర్ణయించింది. అందుకే.. ఈ నెల 21 నుండి తిరుపతి పార్లమెంట్ పరిధిలో ధర్మపరిరక్షణ యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తిరుపతిలో ప్రారంభిస్తారు. దేవాలయాల పరిరక్షణే ధ్వేయంగా ప్రతి నియోజకవర్గంలో 10 ప్రచార రథాలతో ధర్మపరిరక్షణ యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు రథాలను కూడా సిద్ధం చేసుకున్నారు. పేరుకు ధర్మపరిరక్షణ అని చెప్పినా… ఎన్నికల ప్రచారం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకూ వైసీపీ అరాచకాలు.. ప్రభుత్వ వ్యతిరేకత.. అభివృద్ధి లేదని చెప్పడానికి ప్రాధాన్యం ఇస్తూ ఉండేది. కానీ ఆలయాలపై దాడుల ఘటనలు… చంద్రబాబు రామతీర్థం పర్యటనకు వచ్చిన స్పందనను పరిశీలించిన తర్వాత టీడీపీ వ్యూహం మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏపీలో క్రిస్టియన్ ప్రభుత్వం నడుస్తోందన్న ఓ భావన ప్రజల్లోకి బలంగా పంపేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం, హోంమంత్రి, డీజీపీ ఇలా.. అందరూ క్రిస్టియన్సే ప్రధాన పదవుల్లో ఉన్నారని అంటున్నారు.
టీడీపీ నేతలు కూడా అదే ప్రచారం చేస్తున్నారు. ఇది ప్రజల్లోకి వెళ్తే.. ఆటోమేటిక్‌గా చూస్తూ చూస్తూ క్రిస్టియన్ పార్టీకి ఓటు వేయలేని పరిస్థితి ఏర్పడుతుందని వ్యూహం పన్నినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో తమ వ్యూహం బీజేపీకి లాభిస్తుందన్న ఆందోళన కూడా టీడీపీలో ఉంది. అందుకే.. ధర్మ పరిరక్షణలో తాము ముందుంటామని యాత్రలు ప్రారంభిస్తున్నారు. మొత్తానికి టీడీపీ .. రెండు వైపులా పదునున్న కత్తితోరాజకీయ యుద్ధం చేస్తోందన్న అభిప్రాయం మాత్రం వినిపిస్తోంది.