ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధనలో భాగంగా ఫిబ్రవరి 1న రాష్ట్ర బంద్ కు హోదా సాధన సమితి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రం ఇచ్చిన మాట నిలుపుకోలేదనీ, హోదా విషయంలో స్పందించాలని కోరుతూ బంద్ చేస్తున్నట్టుగా హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ చెప్పారు. ఏపీ హక్కుల కోసం చేస్తున్న ఈ బంద్ ను విజయవంతం చేయాలని ఆయన కోరారు. భాజపా తప్ప రాష్ట్రంలోని అన్ని పార్టీలూ బంద్ కి మద్దతు ఇవ్వాలన్నారు. కేంద్రం అనుసరించిన నిర్లక్ష్య వైఖరి వల్ల ఏపీలో ఒక తరం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందన్నారు.
హోదా సాధన సమితి పిలుపు ఇచ్చిన ఈ బంద్ కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందేలా ఉందని సమాచారం. హోదా సాధనలో భాగంగా జరుగుతున్న నిరసన కాబట్టి, మద్దతు ఇవ్వాలనే అభిప్రాయం పలువురు అధికార పార్టీ నేతల నుంచి వ్యక్తమౌతున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశమై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా కొంత సానుకూలత వ్యక్తం చేశారనీ, బంద్ ప్రశాంతంగా జరిగితే… తోచిన విధంగా సాయం అందించాలంటూ నేతలకు, కార్యకర్తలకు ఆయన సూచించినట్టుగా కూడా కొంతమంది చెబుతున్నారు.
హోదా సాధన సమితి ఆధ్వర్యంలో గతంలో నిర్వహించిన బంద్ లకు కూడా టీడీపీ పరోక్షంగా సాయం అందించిందనే చెప్పొచ్చు. ఈసారి నిర్వహిస్తున్న బంద్ విజయవంతం చేయడం కోసం ఆర్టీసీ స్వచ్ఛందంగా వాహనాలను నిలిపే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. పార్లమెంటు చివరి సమావేశాలు కావడంతో, కనీసం ఇప్పుడైనా ఏపీకి సానుకూలంగా కేంద్ర వైఖరి మారాలని ఆశిస్తున్నారు. దీన్లో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీలో ఒక రోజు దీక్ష చేసే ఆలోచనలో ఉన్నట్టు కథనాలు వచ్చాయి. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో హోదా సాధన కోసం జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమానికి మద్దతు ఇవ్వడం ద్వారా… కేంద్రానికి ఏపీ గళాన్ని వినిపించే మరో అవకాశంగా దీన్నీ టీడీపీ చూస్తున్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. ఇక, ఇతర పార్టీల మద్దతు ఎలా ఉంటుందో చూడాలి.