తెలంగాణలో బీజేపీకి సహకరించేందుకు టీడీపీ సిద్ధమయిందని.. ఢిల్లీ నుంచి కొన్నాళ్ల క్రితం వార్తలు వచ్చాయి. ప్రతిగా ఏపీలో సహకరించేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని చెబుతున్నారు. ఇప్పుడు ఆ ప్రకారం… కొన్ని పరిణామాలు అనుకూలంగా జరుగుతున్నాయి. మునుగోడులో టీడీపీ పోటీ చేస్తుందని.. బూర నర్సయ్య గౌడ్, జక్కిలి ఐలయ్య యాదవ్ వంటి బీసీ నాయకుల పేర్లు ప్రచారంలోకి వచ్చినా చంద్రబాబు మాత్రం పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు బీజేపీకి మద్దతు ప్రకటించే ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హైదరాబాద్‌లో చంద్రబాబును కలిసి మునుగోడులో తనకు మద్దతివ్వాలని అడిగే అవకాశాలున్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత అధికారికంగా బీజేపీ అభ్యర్థికి టీడీపీ మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. నిజానికి కోమటిరెడ్డి సోదరులు టీడీపీకి వ్యతిరేకం. టీడీపీతో పొత్తు వల్లే గతంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని చెబుతారు. కానీ ఇప్పుడు బీజేపీలో రాజగోపాల్ రెడ్డి చేరారు. ఆయన టీడీపీ మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. హైకమాండ్ పెద్దలు కూడా అదే సూచించడంతో ఆయన కూడా చంద్రబాబు మద్దతు అడగాలని అనుకుంటున్నారు.
వచ్చే ఎన్నికల కల్లా టీడీపీని ఎంతో కొంత బలోపేతం చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారు. బ లమైన బీసీ నాయకుడైన కాసాని జ్ఞానేశ్వర్‌ను టీడీపీలో చేర్చుకున్నారు. ఆయనకు టీ టీడీపీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. టీఆర్ఎస్ … తమ తెలంగాణ సెటిమెంట్ నువదిలేయడంతో ఇప్పుడు తెలంగాణలో ఇతర పార్టీలకు ఇబ్బంది లేకుండా పోయింది. అందుకే టీడీపీ జోరు పెంచాలనుకుంటోంది.