తూర్పు గోదావరి జిల్లా తునిలో నిన్న జరిగిన హింసాత్మక సంఘటనల వెనుక వైకాపా రాజకీయ కుట్ర ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఏ ఆధారం లేకుండా ఆయన ఇంత తీవ్రమయిన ఆరోపణలు చేసారని భావించలేము.2014 ఎన్నికలలో ఓడిపోయినప్పటి నుండి తమకు అధికారం దక్కకుండా చేసినందుకు చంద్రబాబు నాయుడుపై జగన్మోహన్ రెడ్డి చాలా తీవ్రంగా పోరాటం చేయడం అందరూ చూస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదాపై ఆయన చేసిన పోరాటాన్ని అందుకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చును. ప్రత్యేక హోదా మంజూరు చేయవలసింది కేంద్రప్రభుత్వమయితే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడునే లక్ష్యం చేసుకొని పోరాడటం అందరూ చూశారు. కానీ ఆ ఉద్యమం విఫలమయిన తరువాత నుండి చంద్రబాబు నాయుడుపై పోరాడేందుకు ఒక బలమయిన ఆయుధం కోసం ఎదురుచూస్తున్న సమయంలో ముద్రగడ పద్మనాభం ఉద్యమం మొదలుపెట్టడంతో దానికి వైకాపా మద్దతు తెలిపింది.
గత కొన్ని నెలలుగా కాపునేతలను పార్టీలోకి ఆకర్షించాలని ప్రయత్నిస్తున్న వైకాపా, వారికి రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం ఉద్యమం మొదలుపెడుతున్న ఉద్యమానికి కాంగ్రెస్, వైకాపాలు మద్దతు తెలిపాయి. రాష్ట్ర బీజేపీకి చెందిన ఇద్దరు ప్రముఖ నేతలు కూడా ముద్రగడని కలిసి మద్దతు తెలిపినప్పటికీ, వారు కేవలం కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడానికి మాత్రమే ఆయనను కలిసి మద్దతు తెలిపి ఉండవచ్చును.
ముద్రగడ మొదలు పెట్టిన ఈ ఉద్యమానికి మద్దతు ఈయడం ద్వారా ఒక దెబ్బకు మూడు పిట్టలు కొట్టాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తునట్లు రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. తద్వారా కాపులను వైకాపా వైపు ఆకర్షించవచ్చును. అదే సమయంలో వారిని బిసిలలో చేర్చినట్లయితే బీసీలలో మిగిలిన కులాలవారు వ్యతిరేకించడం తద్యం. కనుక ప్రభుత్వానికి సంకట పరిస్థితులు కల్పించవచ్చును. ఒకవేళ బీసీలు అందుకు అభ్యంతరం చెప్పకపోయినట్లయితే, రేపు మరొక కులానికి చెందినవారు కూడా తమకు రిజర్వేషన్లు కల్పించి బీసీలలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఉద్యమించవచ్చును. కనుక ఏవిధంగా చూసినా ఈ పరిణామాల వలన ప్రభుత్వానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోకతప్పదు. బహుశః అందుకే కాంగ్రెస్, వైకాపాలు ఈ ఉద్యమానికి వెనుక నుండి మద్దతు తెలుపుతున్నాయని భావించవచ్చును. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రెండు పార్టీలపై అంత తీవ్రమయిన ఆరోపణలు చేసి ఉండవచ్చును.