పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న అరకొర నేతలు కూడా ఆయన కోసం పని చేయడం లేదు. మరో వైపు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి వియ్యంకుడు. దీంతో నామా నాగేశ్వరరావు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం పని చేసిన వారిని తనకు మద్దతుగా మళ్లించుకుంటున్నారు.
బీఆర్ఎస్ పార్టీ అనే సంగతిని పక్కన పెట్టినా .. వ్యక్తిగతంగా తనకు మద్దతుగా ఉండాలని పాత టీడీపీ నేతల్ని కోరుతున్నారు. కొత్తగా ఆయన ఖమ్మంలోని జిల్లా పార్టీ ఆఫీసుకు వెళ్లి నేతలందర్నీ పలకరించారు. వారంతా గతంలో నామా నేతృత్వంలో పని చేసిన వారే. చాలా మంది ఆయనతో పాటు బీఆర్ఎస్ లోకి వెళ్లినా ఇంకా టీడీపీని అంటి పెట్టుకుని ఉన్న వారు ఉన్నారు. వారందర్నీ ఈ ఎన్నికల్లో తన కోసం పని చేయాలని కోరారు. టీడీపీతో తన అనుబంధాన్ని ఎవరూ విడదీయలేరని గుర్తు చేసుకున్నాయి. ఖమ్మంలో టీడీపీ అభివృద్ధికి తాను చేసిన కృషిని చెప్పుకున్నారు.
నామా నాగేశ్వరరావుపై టీడీపీ సానుభూతిపరులకు మంచి అభిప్రాయం ఉంది. అయితే టీడీపీలో మిగిలిన వాళ్లు తక్కువ. చాలా మంది తుమ్మలతో పాటు ఇతర నేతలతో పాటు కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల్లో చేరిపోయారు. వారంతా నామాకు ఓటేస్తారో లేదో కానీ.. నామా మాత్రం తన ప్రయత్నాలు చేస్తున్నారు. నామా ఇప్పుడు గట్టి పోటీ ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.