ముద్రగడ పద్మనాభం మొదటిసారి గట్టిగా ఎటువంటి సన్నాహాలు చేసుకోకుండా పోరాటం మొదలుపెట్టేశారు. దాని విపరీత పరిణామాలను చూసిన తరువాత కూడా రెండవసారి కూడా మళ్ళీ ఆయన హడావుడిగా ఆమరణ నిరాహార దీక్ష చేసి అంత వేగంగానూ దాని ముగించేశారు. దాని వలన కాపులకు కొంత మేలు జరిగినా, వ్యక్తిగతంగా ఆయన చాలా విమర్శలు,ఆరోపణలు మూటగట్టుకోవలసి వస్తోంది. కాపులకు రిజర్వేషన్ల కోసం మంజూనాథ కమీషన్ ఆగస్టు నెలలో తన నివేదికని ఈయవలసి ఉంటుంది. కనుక, ఒకవేళ ప్రభుత్వం మళ్ళీ మాట తప్పినా ఏవైనా సాకులు చూపి నిర్ణయాన్ని వాయిదావేసినా, ఈసారి ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కోవాలనే ఉద్దేశ్యంతో ముద్రగడ అందుకు గట్టి సన్నాహాలు చేసుకొంటున్నారు. తన పోరాటానికి మద్దతు కోరుతూ ఆయన అనేకమంది ప్రముఖులను కలుస్తున్నారు.
అది చూసి తెదేపా నేతలు, మంత్రులు ఆయనపై విమర్శల జోరు పెంచారు. ఆయన వెనుక జగన్ ఉన్నారని, జగన్ వ్యూహాన్నే ఆయన అమలు చేస్తున్నారని, ఆయన వ్యవహరిస్తున్న తీరు, వాడుతున్న బాష, వ్యూహం అన్నీ చూస్తుంటే ఆయన కాపుల కోసం పోరాడుతున్నట్లుగా కాక, జగన్ కోసం పోరాడుతున్నట్లుందని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావు, నిమ్మకాయల చినరాజప్ప తదితరులు ముద్రగడని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కూడా వారి బాటలోనే నడుస్తూ, ముద్రగడకి ఒక లేఖ వ్రాశారు. అందులో ఆయన ప్రస్తావించిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.
ఆయన ఏమి వ్రాశారంటే, “మీరు (ముద్రగడ) జగన్మోహన్ రెడ్డిని సంతోషపరచడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆవిధంగా లేఖలు వ్రాస్తున్నారా? అందుకే ప్రభుత్వానికి అల్టిమేటంలు ఇస్తున్నారా? మీరు చేస్తున్న ఉద్యమం వలన సమాజంలో ఇతర కులాలలో అసహనం, అసంతృప్తి పెరగడం మీకు పట్టదా? ముఖ్యమంత్రిని బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేయాలని ప్రయత్నించడం వలన కాపులకు మేలు జరుగుతుందా?” అని ప్రశ్నలు సందించారు.
ఆ లేఖలో ముద్రగడ ఉద్యమం వలన సమాజంలో ఇతర కులాలలో అసహనం, అసంతృప్తి పెరగడం వాస్తవమేనని చెప్పవచ్చు. ఆయన ఉద్యమించగానే బీసి సంఘాలు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముద్రగడ బిసి సంఘాల నేత ఆర్. కృష్ణయ్యని కలిసి ఆయన మద్దతు కూడా కోరారు. కాపులకు రిజర్వేషన్లు కేటాయించడం వలన బీసిలకు నష్టం కలుగదనే నమ్మకం కలిగితే తప్ప వాళ్ళు ఆయనకు మద్దతు తెలుపరు. ముద్రగడ ఉద్యమానికి ఎవరు మద్దతు ఇస్తున్నారో, ఎవరు ఇస్తారో ఖచ్చితంగా తెలియనప్పటికీ, ఆయన హడావుడి పెరుగుతున్న కొద్దీ, తెదేపా నేతలలో ఆందోళన కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. అది వాళ్ళ మాటలలోనే స్పష్టంగా కనిపిస్తోంది.