ముఖ్యమంత్రికి చెందిన సరస్వతి పవర్ కంపెనీకి నీళ్లు, భూములు కేటాయింపు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని టీడీపీ ఆరోపిస్తోంది. ఇలా చంద్రబాబు స్టేట్మెంట్ ఇచ్చినందుకు.. ఆ వివరాలను ఈనాడు సహా ఇతర పత్రికలు ప్రచురించినందుకు లీగల్ నోటీసులు కూడా పంపింది ప్రభుత్వం. దీన్నే అవకాశంగా చేసుకుని సరస్వతి కంపెనీ వ్యవహారాలను మరంత చర్చకు పెడుతోంది తెలుగుదేశం పార్టీ. లీగల్ నోటీసులను అధికారికంగా.., పంపామని ఆ శాఖను చూస్తున్న ..గోపాలకృష్ణ ద్వివేదీ స్వయంగా ప్రకటించారు. ఇప్పుడు టీడీపీ… తాము తప్పు చెప్పలేదని.. అవకతవకలు నిజమేనని.. ఈ వ్యవహారంలో ఉన్న వారు శ్రీలక్ష్మి తరహాలో జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
సరస్వతి పవర్ మొదట.. విద్యుత్ ప్రాజెక్టు కోసం అనుమతి తీసుకుంది. తర్వాత సిమెంట్ తయారీని కూడా చేపట్టాలని నిర్ణయించుకుంది. వైఎస్ హయాంలో ఐఎఎస్ శ్రీలక్ష్మి సంతకంతో గనులు కేటాయించారు. కానీ.. నిబంధనల ప్రకారం పనులు జరగకపోవడంతో.. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో .. ఆ తర్వాత చంద్రబాబు హయాంలో మొత్తం అనుమతులు రద్దయ్యాయి. అప్పుడే సరస్వతి పవర్ కోర్టుకు వెళ్లింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోర్టు నుంచి సానుకూల ఫలితం పొందింది . కేంద్రం నుంచి కూడా.. కొన్ని అనుమతులు పొందింది. అయితే.. ఈ క్రమంలో కేంద్రానికి.. కోర్టుకు కూడా.. తప్పుడు సమాచారం ఇచ్చిందని టీడీపీ నేతలు కొత్తగా పత్రాలు బయట పెట్టారు.
అనుమతుల కోసం కేంద్రానికి ఓ సర్వే నెంబర్లతో దరఖాస్తు చేసి.. మరో రకమైన సర్వే నెంబర్లతో జీవో ఇచ్చారని.. టీడీపీనేత పట్టాభిరామ్ బయట పెట్టారు. అలాగే… మైనింగ్ అనుమతులు పొందిన స్థలం మొత్తం ప్రైవేటుదని హైకోర్టుకు చెప్పారని.. పాతిక ఎకరాల ప్రభుత్వ భూమి ఉందనే విషయాన్ని దాచి పెట్టారని వివరించారు. ఈ విషయాన్ని అడ్వకేట్ జనరల్ కూడాదాచి పెట్టారని.. టీడీపీ ఆరోపిస్తోంది. వీటన్నింటినీ తెలుగుదేశం పార్టీ హైలెట్ చేస్తోంది. ముఖ్యమంత్రి సొంత కంపెనీలకు నిబంధనలకు అనుగుణంగానైనా… ప్రభుత్వ పరంగా ప్రయోజనాలు కల్పించడాన్ని… నైతికంగా భావించరు. అలాంటి పనులు అధికారంలో ఉన్న వారు చేయరు. కానీ ఏపీలో మాత్రం భిన్నంగా జరుగుతోంది. శాశ్వత నీటి కేటాయింపులు.. గనుల లీజులు పొడిగింపులు అన్నీ యుద్ధ ప్రాతిపదికన జరగుతున్నాయి. దీనిని టీడీపీనేతలు ప్రశ్నిస్తే.. ప్రభుత్వం వివరణ ఇవ్వకుండా కేసులు అంటోంది. ఈ కేసులు పెడతామనే అంశాన్నే ఆధారంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ ఈ విషయాన్ని మరింతగా ప్రజల్లోకి చర్చకు పెడుతోంది.