ఈవీఎంలలో సాంకేతికంగా లోపాలు కనిపిస్తున్నాయనీ, వాటిని హేక్ చేసేందుకు అవకాశాలు స్పష్టంగా ఉన్నాయంటున్నారు ఏపీ ప్రభుత్వ సాంకేతిక సలహాదారు హరికృష్ణ ప్రసాద్. 2010లోనే తాను ఇది నిరూపించాననీ, ఆ తరువాత వీవీప్యాట్లను తీసుకొస్తే తాను అభినందించానని కూడా ఆయన అన్నారు. ఈనెల 10న పీలేరులోని ఒక పోలింగ్ బూత్ లో ఓటింగ్ ప్రక్రియను ప్రదర్శించారనీ, అది తన దృష్టికి వచ్చిందన్నారు. ఓటు వెయ్యగానే మెల్లగా వీవీప్యాట్ స్లిప్ ప్రింట్ అయి, 7 సెకెన్లపాటు మనకు కనిపించాలనీ, కానీ అక్కడ 3 సెకెన్లు మాత్రమే కనిపించిందన్నారు. ఇదే విషయం కలెక్టర్ కి ఫోన్ చేసి చెప్తే… 3 సెకెన్లు కనిపించినా ఫర్వాలేదు ప్రొసీడ్ అని చెప్పారన్నారు. ఇంకా అనుమానం ఉంటే ఆ మెషీన్ మార్చేద్దామన్నారని చెప్పారు. అయితే, సమస్య ఒక్క మెషీన్ మార్పు గురించి కాదనీ, 7 సెకెన్లు కనిపించాల్సిన విధంగా ప్రోగ్రామ్ రాసి ఉన్న ఈవీఎంలో… 3 సెకెన్లు మాత్రమే వీవీప్యాట్ స్లిప్పు ఎలా కనిపిస్తుందనేది కదా అసలు ప్రశ్న అన్నారు హరికృష్ణ ప్రసాద్. కోడ్ మారితే తప్ప ఇలా జరగదన్నారు.
ఎన్నికల రోజున ఉదయం నుంచే తనకు కొంతమంది వీడియోలు పంపించారనీ, 7 సెకెన్లు కనిపించాల్సిన వీవీప్యాట్లలో 3 సెకెన్లు… కొన్ని చోట్ల 2 సెకెన్లు మాత్రమే డిస్ ప్లే ఉంటోందంటూ తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని వెంటనే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాననీ, వీడియోలు కూడా వారికి పంపించానన్నారు. కానీ, ఈసీ నుంచి స్పందన లేదన్నారు. తాను వేసిన ఓటు ఏ గుర్తుకి పడిందో అనేది 7 సెకెన్ల పాటు ఓటరుకు కనిపించాలనే విధంగా ఈవీఎంలో ప్రోగ్రామ్ రాసి ఉంటుందనీ, ఆ సమయం తగ్గిందీ అంటూ ఆ కోడింగ్ ను ఎవరు మార్చారనేదానిపై దృష్టిపెట్టాలన్నారు. ఎవరో మార్చకుండా ఇది సాధ్యం కాదన్నారు. కోడ్ ఇలా మారినట్టు మొదటి దశ చెకింగ్ లో ఇంజినీర్లు గమనించారో లేదో వారికే తెలియాలన్నారు.
గత ఏడాది నవంబర్ లో ఏడు రాష్ట్రాల్లోని ఈవీఎంలను ఎన్నికల సంఘం వెనక్కి రప్పించదని చెప్పారు హరిప్రసాద్. ఎందుకు వెనక్కి తెచ్చారని అడిగితే… మెషీన్లను అల్యూమినియం కవర్లకు బదులుగా, స్టీల్ కవర్లు వెయ్యాలనీ టెక్నికల్ కమిటీ చెప్పిందని సమాధానమిచ్చారన్నారు. ఇది సరైన కారణంగా కనిపించడం లేదనీ, ఏడు రాష్ట్రాల నుంచి మెషీన్లు వెనక్కి తెస్తున్నప్పుడు రాజకీయ పార్టీలకు సమాచారం ఇవ్వాల్సి ఉందనీ, ఈసీ ఇచ్చిందో లేదో వారికే తెలియాలన్నారు.
ఈవీఎంల భద్రతపై మరింత స్పష్టత ఇచ్చే విధంగా ఈసీ వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తోంది. లోపాలున్నాయని సాంకేతికంగా నిరూపించేవాళ్లు ఉన్నప్పుడు, అవి అసాధ్యమని ఈసీ కూడా అంతే సాంకేతికంగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవి ఒక పార్టీకి చెందనివారు చేస్తున్న ఆరోపణలుగా చూడకూడదు. రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థగా ఉండాల్సిన ఎన్నికల సంఘం… ఈ అనుమానాలపై ఎలా స్పందిస్తుందో చూడాలి. దురదృష్టం ఏంటంటే ఇవన్నీ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలుగా అధికార పార్టీ చూడటం! దానికి అనుగుణంగానే ఈసీ పనితీరు కనిపిస్తూ ఉండటం. ఈ అనుమానాలపై ప్రజల్లో చర్చ మొదలైంది. వివరణ ఇవ్వకపోతే ప్రజలకీ నమ్మకం పోతుంది. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయేవరకూ పరిస్థితి వెళ్లకూడదు.