వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని చెప్పగానే, అందరి కంటే ముందుగా తెదేపా అప్రమత్తమయిందని, పవన్ కళ్యాణ్ న్ని డ్డీ కొనేందుకు తెదేపా ఎంపి గల్లా జయదేవ్ ద్వారా హీరో మహేష్ బాబుని రప్పించాలని భావిస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చేయి. ఆ వార్తలలో జూ.ఎన్టీఆర్ పేరు కూడా వినపడటం విశేషం. ఆయన తెదేపా పెరట్లో తిరుగాడే కోడిపుంజు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేస్తాడన్నట్లు, ఆయన ప్రమేయం లేకుండానే ఆయన పేరును కూడా తెదేపా పద్దులో వ్రాసి పడేశాయి.
అయితే నారా లోకేష్ కి పోటీగా వస్తాడనే భయంతో జూ.ఎన్టీఆర్ ని క్రమంగా పార్టీ నుంచి దూరం చేయడమే కాకుండా ఆయన సినీ కెరీర్ ని కూడా చాలా ఘోరంగా దెబ్బతీశారు. దీనికంతటికీ కారణం వైకాపా ఎమ్మెల్యే కొడాలి నానితో జూ.ఎన్టీఆర్ కున్న స్నేహమని తెదేపా వాదిస్తోంది. కానీ అసలు కారణం వేరే ఉందని అందరికీ తెలుసు.
అంతకుముందు ఎన్నికలలో జూ.ఎన్టీఆర్ కాకీ డ్రెస్ వేసుకొని ఎన్నికల ప్రచార రధంపై నిలబడి అనర్గళంగా ప్రజలను ఆకట్టుకొనే విధంగా అద్భుతంగా ప్రసంగాలు చేస్తున్నప్పుడు పార్టీలో వాళ్ళు, ప్రజలందరూ కూడా ఆయనే స్వర్గీయ ఎన్టీఆర్ కి అసలు సిసలయిన వారసుడని గట్టిగా నమ్మారు. అది చూసి చంద్రబాబు నాయుడు అప్రమత్తమయిపోయారు. జూ.ఎన్టీఆర్ ఎక్కడ తన కొడుకు నారా లోకేష్ కి పార్టీలో పోటీ అవుతాడో అనే భయంతోనే ఒక పద్ధతి ప్రకారం జూ.ఎన్టీఆర్ ని పార్టీ నుండి దూరం చేసారు. అయినా కూడా జూ.ఎన్టీఆర్ 2014 ఎన్నికలలో తెదేపా తరపున ప్రచారం చేయడానికి ఆసక్తి కనబరిచినప్పటికీ, ‘నీ అవసరం మాకు లేదన్నట్లుగా’ తెదేపా వ్యవహరించింది.
ఆయన తండ్రి నందమూరి హరికృష్ణ తనే స్వర్గీయ ఎన్టీఆర్ కి అసలయిన వారసుడిని, కనుక తెదేపాలో అందరూ తనను చూసి భయపడాలన్నట్లుగా ప్రదర్శించిన అహంభావం, చంద్రబాబు నాయుడుకి మాట మాత్రంగా చెప్పకుండా రాజ్యసభ పదవికి రాజీనామా చేసి, సమైక్యాంధ్ర బస్సు యాత్ర చేపట్టాలనుకోవడం వంటి అనేక అంశాలు జూ.ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి శాపాలుగా మారాయి.
తనపై పార్టీలో నెలకొన్న అపోహలు తొలగించేందుకు జూ.ఎన్టీఆర్ తనకు రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తి లేదని, తన తాతగారు స్థాపించిన పార్టీ అనే గౌరవంతోనే తెదేపా ప్రచారంలో పాల్గొన్నానని, కొడాలి నాని రాజకీయ నిర్ణయాలతో తనకు ఎటువంటి సంబంధమూ లేదని, తన దృష్టి అంతా కేవలం తన సినిమాలపైనే ఉందని పదేపదే చెప్పుకొన్నా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఎందుకంటే జూ.ఎన్టీఆర్ చెప్పే సంజాయిషీలు వినాలనే ఆసక్తి చంద్రబాబు నాయుడుకి లేకపోవడమే.
జూ.ఎన్టీఆర్ తెదేపాకు దూరం అయినప్పటి నుంచి ఆ ప్రభావం ఆయన సినీ కెరీర్ మీద కూడా చాలా విపరీతంగా పడింది. అందుకు ఎవరు కారకులో..ఆవిధంగా ఎందుకు జూ.ఎన్టీఆర్ ని అణగ ద్రొక్కేసారో అందరికీ తెలుసు కనుక మళ్ళీ వాటి గురించి చెప్పుకోనవసరం లేదు. జూ.ఎన్టీఆర్ తో ఇంత నిర్దయగా వ్యవహరించిన తరువాత మళ్ళీ ఆయన పార్టీ ప్రచారానికి పిలిస్తే వస్తారనుకోలేము. ఒకవేళ కాదనలేక వచ్చినా ఎన్నికలు పూర్తవగానే ఆయనని పులిహోరలో కరివేపాకులాగ తీసి పక్కనపడేయడం ఖాయం. కనుక జూ.ఎన్టీఆర్ ని ఎన్నికల ప్రచారానికి పిలిచినా రాకపోవచ్చును లేదా ఈ ఇబ్బందికర పరిస్థితులను తప్పించుకొనేందుకు ఆ సమయంలో విదేశాలలో సినిమా షూటింగ్ వెళ్లిపోవచ్చును. అయినా ఇప్పటి నుంచి జూ.ఎన్టీఆర్ వస్తారా రారా? అని ఆలోచించడం అనవసరం. ఏమయినప్పటికీ తెదేపా నేతలు నారా లోకేష్ తమని ఒడ్డున పడేస్తారని చెప్పుకొనే బదులు జూ.ఎన్టీఆర్ ని రప్పించాలనుకోవడం విచిత్రంగానే ఉంది కానీ దానర్ధం ఏమిటి?