వైసీపీలో వివేకానందరెడ్డి హత్య కేసు భయం అంతకంతకూ పెరిగిపోతోంది. వివేకా హత్య కేసులో నిజాలు బయటకు వస్తూండటంతో ఏదేదో జరుగుతోందని ఊహించుకుంటున్నారు. దాన్నే మీడియా ముందు చెబుతున్నారు. ఈ కేసు విషయంలో వైసీపీకి సంబంధం లేదని చెప్పుకునేందుకు సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చాలా కసరత్తు చేసి మీడియా ముందుకు వస్తున్నారు. ఇలా శుక్రవారం ఆయన పెట్టిన ప్రెస్మీట్లో ఎప్పట్లాగే చెప్పాల్సినవి చెప్పి సునీతకు టీడీపీ టిక్కెట్ ఇచ్చి వైఎస్ కుటుంబంలో చీలిక తేవాలనుకుంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ కుటుంబం మొత్తం ఇప్పటికీ ఒక్కటిగానేఉందని అనుకుంటున్నట్లుగా ఉంది. సీఎం జగన్ చెల్లి షర్మిలతో పాటు తల్లి కూడా జగన్ వెంట లేరు. ఆమె తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకున్నారు. వివేకా ఫ్యామిలీ న్యాయపోరాటం చేస్తున్నారు. వారిపై వైసీపీ మీడియా ఎందు తప్పుడు ప్రచారం చేస్తున్నారో రోజూ కళ్ల ఎదుట కనిపిస్తూనే ఉంది. అయినా సజ్జల మాత్రం వైఎస్ కుటుంబం ఒక్కటిగా ఉందని టీడీపీ వివేకా కుమార్తెకు టిక్కెట్ ఇచ్చి చీలిక తేవాలనుకుంటోందని ఆరోపిస్తున్నారు.
వివేకా కుమార్తె, టీడీపీకి ఆ ఆలోచనఉందో లేదో కానీ సజ్జల మాత్రం ఓ గొప్ప ఐడియా ఇచ్చేశారు. తండ్రిని చంపేశామని ఆమె సెంటిమెంట్‌తో కడప ప్రజల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించే సెంటిమెంట్ అస్త్రానికి ఖచ్చితంగా విరుగుడు అయ్యే అవకాశం ఉంది. సునీత ఎలాంటి బెదిరిపులకు లొంగరని న్యాయం కోసం పోరాడతారని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలే నిరూపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు వైసీపీలో ఈ అంశంపై రచ్చ ప్రారంభమయింది. కడప టిక్కెట్ కోసమే వివేకాను అవినాష్ ఫ్యామిలీ హత్య చేసిందన్న ప్రచారం కూడా జరుగుతూండటంతో ముందు ముందు రాజకీయంగానూ కీలక మలుపు ఖాయమని సజ్జల చెప్పకనే చెప్పారు.