తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ ఈ సారి లోక్‌సభకు మూడు చోట్లా కొత్త ముఖాల్ని బరిలోకి దించనుంది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తూ.గో జిల్లాలోఉన్న మూడు పార్లమెంట్ స్థానాలు దక్కాయి. రాజమండ్రి నుంచి మురళీ మోహన్, అమలాపురం నుంచి రవీంద్రబాబు, కాకినాడ నుంచి తోట నరసింహం విజయం సాధించారు. తోట నరసింహం అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కోలేనని.. తన భార్యకు అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాలని కోరారు. అయితే ఆయన కోరిన జగ్గంపేట టిక్కెట్ ను జ్యోతుల నెహ్రూకి ఇచ్చారు. కాకినాడ పార్లమెంట్ స్థానాన్ని చలమలశెట్టి సునీల్ కు ఖరారు చేశారు. దీంతో తోట నరసింహం భార్య వాణికి వేరే పదవిని ఇస్తారని ప్రచారం జరుగుతుంది.
అమలాపురం ఎంపి స్థానాన్ని రవీంద్రబాబుకు ఈ సారి టిక్కట్ ఇచ్చేది లేదని ఆయనకే నేరుగా టీడీపీ హైకమాండ్ చెప్పింది. దాంతో ఆయన వైసీపీలో చేరిపోయారు. అమలాపురం నుంచి మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడు హరీష్ కి టిక్కెట్ ఇవ్వాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ఇక పోటీ ఖాయం అనుకున్న… మురళీమోహన్.. అనూహ్యంగా బరి నుంచి వైదొలిగారు. ఆయన వైదొలిగి కుటుంబ సభ్యులకు చాన్సిస్తారని అనుకున్నారు. కానీ కుటుంబ సభ్యులు కూడా పోటీ చేయరని నేరుగా చంద్రబాబుకే తేల్చి చెప్పారు. పార్టీ కోసం పనిచేస్తానని ఆయన సమీక్షా సమావేశంలో చెప్పడంతో.. చంద్రబాబు కొత్త అభ్యర్థిపై కసరత్తు ప్రారంభించారు. రాజమండ్రి పార్లమెంట్ నుంచి ఎవరు పోటీ చేస్తారని మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అనేకమంది పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ, ఎవరికి ఇచ్చినా..తాను మద్దతు ఇస్తానని మురళీమోహన్ స్పష్టం చేశారు.
కాకినాడకు టీడీపీకి కొత్త అయిన చలమలశెట్టి సునీల్, అమలాపురంకు బాలయోగి కుమారుడు పేర్లు ఖరారు చేసినా… రాజమండ్రి విషయంలో మాత్రం.. కొత్త నేతను తెరపైకి తీసుకు రాక తప్పదు. సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ… ఆయనకు అసెంబ్లీ టిక్కెట్ ఖరారు చేశారు. ప్రతీ సారి రాజమండ్రి పోరు అంటే.. సినీ గ్లామర్‌తో హైలెట్ అయ్యేది. ఈ సారి మాత్రం.. పెద్దగా పేరు లేని నేతల మధ్య పోరు జరిగే అవకాశం కనిపిస్తోంది.