ప్రత్యేక హోదాతోపాటు, విభజన హామీల సాధన దిశగా అధికార పార్టీ టీడీపీ కేంద్రంపై పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ పోరాటంలో భాగంగా ఇప్పటికే ఎన్డీయే నుంచి టీడీపీ బయటకి వచ్చేసింది. కేంద్రమంత్రులు రాజీనామాలు చేశారు. భాజపాతో మైత్రి తెంచుకున్నారు. పార్లమెంటు సమావేశాల్లో పోరాడారు. సమావేశాలు ముగిశాక… ఉద్యమానికి రాష్ట్రమే వేదికైంది. ముందుగా సీఎం ఒక రోజు నిరాహార దీక్ష చేశారు. నియోజక వర్గాల్లో నేతలు సైకిల్ యాత్రలు చేశారు. ఆ తరువాత, తిరుపతిలో ధర్మపోరాట సభ పెట్టారు. ఆ తరువాత… ఈ నెల మూడోవారంలో విశాఖపట్నంలో రెండో ధర్మపోరాట సభ ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఆ తరువాత, అంటే… మరో ధర్మపోరాట సభ ఉంటుంది. ఆ తరువాత, ఇంకోటి..? ఇకపై నెలకి ఒక ధర్మ పోరాట సభ చొప్పున ఎన్నికల వరకూ నిర్వహిస్తూ పోవాలనేది తెలుగుదేశం పార్టీ ఆలోచనగా తెలుస్తోంది. ఎన్నికలు సమీపించే నాటికి అమరావతిలో చివరి సభ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట. అంటే, ఇకపై నెలకో సభ నిర్వహణపైనే అధికార పార్టీ ఎక్కువగా దృష్టి పెట్టబోతున్నట్టు అర్థం చేసుకోవాలి. హోదా ఉద్యమాన్ని, ప్రజల్లో ఇప్పుడున్న సెంటిమెంట్ ను కొసాగించాలంటే ఇలా ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, ప్రజలను మమేకం చేయడం అనేది ఒక రాజకీయ పార్టీగా టీడీపీ అవసరం. కానీ, ఇది సరిపోదు..?
అధికార పార్టీగా చేయాల్సిన పని మరొకటి ఉంటుంది. ఈ సభల నిర్వహణతోపాటు… ఈ ఏడాదిలోగా కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చెయ్యాలి. పార్లమెంటు నిరవధిక వాయిదా తరువాత రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక హోదాపై ఎంత ఉద్యమిస్తున్నా… అది తమకు సంబంధం లేని విషయం అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం తీరు ఉంటోంది. పార్లమెంటులో టీడీపీ నిలదీయడం, అవిశ్వాస తీర్మానం, సీఎం ఢిల్లీ పర్యటన… ఈ క్రమంలో కొంతైనా కేంద్రంలోని అధికార పార్టీ ఉక్కిరిబిక్కిరికి లోనైంది. కానీ, ఇప్పుడు ఆంధ్రాలో ఉద్యమాలు జరుగుతుంటే, తమకేం పట్టదు అన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఏడాదిలోగా ఎన్నికలు ఉన్నమాట వాస్తవమే. ఈలోగా ఆంధ్రా విషయమై భాజపా సానుకూలంగా స్పందించే అవకాశం లేదన్నదీ అర్థమౌతూనే ఉంది. అయినా, ఏడాది సమయం ఉంది కదా! ఈ లోగా మోడీ సర్కారుపై ఏపీ సమస్యల విషయమై ఏదో ఒక మార్గం ద్వారా ఒత్తిడి పెంచాల్సిన అవసరమైతే ఉంది. పార్టీపరంగా ఎన్నికల వరకూ ప్రజలను ఎంగేజ్ చేసేందుకు ధర్మపోరాట సభలు సరిపోవచ్చు, కానీ అధికార పార్టీగా ఈ ఏడాదిలోపు చేయాల్సిన ప్రయత్నంలో భాగంగా కేవలం ఈ రాష్ట్ర స్థాయి సభలు మాత్రమే సరిపోవు అనేది విశ్లేషకుల మాట. మరి, అలాంటి వ్యూహం టీడీపీ వద్ద ఉందేమో ఇప్పటికైతే తెలీదు.