త్వరలో వరంగల్, ఖమ్మం మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలు జరుగబోతున్నాయి. వరంగల్ కార్పోరేషన్ లో మొత్తం 58 స్థానాలుండగా వాటిలో 53స్థానాలలో తెదేపా పోటీ చేయడానికి సిద్దం అవుతోంది. మిగిలిన 5 స్థానాలను తెదేపాతో అనుబందం ఉన్న స్వతంత్ర అభ్యర్ధులకు కేటాయించాలని నిర్ణయించింది. అంటే ఈ ఎన్నికలలో తెదేపా, బీజేపీలు కలిసి పోటీ చేయడం లేదని స్పష్టం అవుతోంది.
వరంగల్ ఉపఎన్నికల మొదలు హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల వరకు తెదేపా, బీజేపీలు కలిసి పోటీ చేస్తున్నా ఎదురుదెబ్బలు తినక తప్పలేదు. తెదేపా కారణంగానే తాము నష్టపోతున్నమనే భావన రాష్ట్ర బీజేపీ నేతల్లో ఎప్పటి నుంచో ఉంది. గ్రేటర్ ఎన్నికల తరువాత తెదేపాతో తెగతెంపులు చేసుకోవాలని తెలంగాణా రాష్ట్ర బీజేపీ తమ అధిష్టానాన్ని కోరినట్లు మీడియాలో వార్తలు వచ్చేయి. కనుక రాష్ట్ర బీజేపీ నేతలకి తెదేపాతో కలిసి పనిచేయడం ఇష్టం లేదాని స్పష్టం అవుతోంది. బహుశః అందుకే ఈ ఎన్నికలలో తెదేపా ఒంటరిగా బరిలోకి దిగబోతున్నట్లుంది.
అయితే ఈ ఎన్నికలలో బీజేపీ పోటీ చేస్తుందా..లేదో చూడాలి. ఒకవేళ ఈ ఎన్నికలలో బీజేపీ కూడా వేరేగా పోటీ చేయడానికి సిద్దపడినట్లయితే అది తెదేపా, బీజేపీలు విడిపోవడానికి తొలి సంకేతంగా భావించవచ్చును. అదే జరిగితే ఆంధ్రాలో ఆ రెండు పార్టీల మీద ఈ ప్రభావం తప్పకుండా ఉంటుంది.
ఆంధ్రాకి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేంద్రప్రభుత్వం రాష్ట్రం పట్ల ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య ధోరణి కారణంగా ఇప్పటికే తెదేపా నేతలు మోడీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. నిన్న రైల్వే బడ్జెట్ లో కూడా రైల్వే జోన్ ఏర్పాటుపై ఎటువంటి ప్రకటన లేకపోవడంతో తెదేపా నేతలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. పైగా అందుకు వారు రాష్ట్రంలో ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తప్పు ఏమీ లేకపోయినప్పటికీ, రాష్ట్రం పట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరి కారణంగానే తెదేపా ప్రభుత్వం ప్రజలు, ప్రతిపక్షాల నుండి విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది. అలాగే తెదేపా ప్రభుత్వ పనితీరు పట్ల రాష్ట్ర బీజేపీ నేతలు కూడా చాలా అసంతృప్తిగానే ఉన్నారు. కనుక తెలంగాణాలో జరుగబోయే ఈ రాజకీయ పరిణామాలు ఆంధ్రాలో ఆ రెండు పార్టీలపై తప్పక ప్రభావం చూపే అవకాశం ఉందని భావించవచ్చును.