రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలని .. తెలుగుదేశం పార్టీ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. తమ పార్టీ అభ్యర్థిగా వర్ల రామయ్యను చంద్రబాబు ప్రకటించారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చ జరగడం కోసమే .. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించామని చంద్రబాబు ప్రకటించారు. రాజ్యసభ ఎన్నికల్లో మా ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేస్తామని.. పార్టీ ఏజెంట్‌కు చూపి ఓటేయాల్సి ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. విప్ ఉల్లంఘిస్తే అనర్హతకు గురవుతారని తేల్చి చెప్పారు. ప్రభుత్వం చేసేది తప్పని భావిస్తే వైసీపీ ఎమ్మెల్యేలు..వర్లకు ఓటేయాలని చంద్రబాబు పిలుపునిస్తున్నారు.
వైసీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఎలాంటి పిలుపునిచ్చినా… చంద్రబాబు వ్యూహం మాత్రం.. రెండు స్థానాలకు ఉపఎన్నికలు తీసుకు రావాలనే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు లభించాయి. కానీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి… వైసీపీ ఆకర్ష్ లో పడిపోయారు. ఆ పార్టీలో చేరలేదు. పార్టీ ఫిరాయిస్తే.. అనర్హతా వేటు వేస్తామని గంభీరమైన ప్రకటనలు గతంలో వైసీపీ అధినాయకత్వం చేసి ఉండటంతో ప్రత్యేక సభ్యులుగా గుర్తించి.. ప్రస్తుతానికి పార్టీలో చేర్చుకోలేదు. వీరు సాంకేతికంగా టీడీపీ గుర్తుపై గెలిచారు కాబట్టి.. టీడీపీ సభ్యులే. విప్ ను ధిక్కరిస్తే.. అనర్హతా వేటుకు గురవుతారు.
అందుకే శాసనమండలిని రద్దు చేస్తూ.. అసెంబ్లీ చేసిన తీర్మానంలో ఓటింగ్ కు కూడా వీరు హాజరు కాలేదు. ఇప్పుడు వీరిని ఫిక్స్ చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. దీనికి రాజ్యసభ ఎన్నికలను ఉపయోగించుకుంటున్నారు. 175 మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి కాబట్టి.. ఒక్కొక్క ఎమ్మెల్యేకు 44 మంది కావాలి. టీడీపీ ఎలాంటి అవకాశం లేదు. కేవలం విప్ జారీ చేసి.. రెండు చోట్ల ఉపఎన్నికలు తేవాలన్న లక్ష్యంతోనే పోటీ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.