తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి పరాజయం … ఏపీ కాంగ్రెస్ నేతల ఆశలపై నీళ్లు చల్లింది. తెలంగాణలో ప్రజాకూటమి గెలిచి ఉంటే.. ఈ పాటికి… ఏపీ కాంగ్రెస్ నేతల ప్రకటనలు ఓ రేంజ్లో ఉండేవి. కానీ కాలం కలసి రాలేదు. దాంతో ఇప్పుడు వారు టెన్షన్‌కు గురవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కనీసం పరువు ఎలా కాపాడుకోవాలా.. అన్నదే వారి టెన్షన్. తెలంగాణలో తగిలిన షాక్‌తో ఏపీలో కాంగ్రెస్ జోలికి వెళ్లాలని చంద్రబాబునాయుడు అనుకోవడం లేదు. అలా అనుకునే పరిస్థితి అయితే.. ఈ పాటికి రాజకీయాలు వేరుగా ఉండేవి. ఆయన వచ్చే జమిలీ ఎన్నికల్లో… కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటేనే మంచిదని అంచనా వేసుకున్నారు. అయితే.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కలసి పని చేస్తామని మాత్రం క్లారిటీ ఇస్తున్నారు.
తెలుగుదేశం పార్టీతో పొత్తులుంటే… కనీసం పార్టీలో మిగిలిన సీనియర్ నేతలకైనా టిక్కెట్లు వస్తాయని… రఘువీరా లాంటి వాళ్లు ఆశలు పెట్టుకున్నారు. కానీ… తెలంగాణ ఎన్నికల తర్వాత… ఆ ఆశలు ఆవిరైపోయాయి. తెలంగాణ ఎన్నికలకు ముందు చాలా పెద్ద పెద్ద డైలాగులు చెప్పిన రఘువీరా.. ఇప్పుడు.. తమతో పొత్తులు పెట్టుకుంటే.. జాక్ పాట్ కొట్టినట్లేనని… ఆఫర్లు ఇస్తున్నారు. పొత్తుల విషయంపై రాహుల్ గాంధీతో సమావేశమైన.. రఘువీరాకు.. క్లారిటీ రాలేదు. చంద్రబాబు నుంచి ఎలాంటి సూచనలు రాలేదని… రాహుల్ చెప్పి పంపిచేశారు. దీంతో.. మరో వారం రోజుల తర్వాత పొత్తుల గురించి చెబుతామని.. రఘువీరా మీడియా ముందు హడావుడి పడ్డారు కానీ.. చెప్పాల్సింది చంద్రబాబునాయుడు. ఆయన సరే అంటే.. పొత్తులుటాయి… లేకపోతే లేదు. ఈ విషయంలో.. కాంగ్రెస్ పార్టీకి మరో చాయిస్ లేదు. ఆ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలని కూడా ఎవరూ అనుకోవడం లేదు.
నంద్యాల ఉపఎన్నికల్లో… రఘువీరా అభ్యర్థిని నిలబెట్టి… ప్రచారం చేసినా… వెయ్యి ఓట్లకు అటూఇటుగానే వచ్చాయి. అయినా రఘువీరారెడ్డి.. మాత్రం… తమ పార్టీకి ఒంటరిగా పోటీ చేసినా.. సీట్లు వస్తాయని… తమ పార్టీ మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రకటించేసుకుంటున్నారు. ఇది మరీ అతిశయోక్తిగా ఉన్నా… వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు ఏ మాత్రం సిద్ధపడే అవకాశాలు అయితే లేవు. రాజకీయ పరిస్థితుల్లో ఏమైనా మార్పులొస్తే… అప్పుడు పరిశీలిస్తారేమో..?.