తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరిక ఖాయమయింది. అమిత్ షా , జేపీ నడ్డాలతో చంద్రబాబునాయుడు ఢిల్లీలో గంట సేపు చర్చలు జరిపారు. ఇంతకు ముందే ఈ భేటీకి సంబంధించిన గ్రౌండ్ వర్క్ పూర్తి కావడంతో వారు ఓ అవగాహనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎన్డీఏలో చేరడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులపై చంద్రబాబు పూసగుచ్చినట్లుగా వివరించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో అమిత్ షా వద్ద కూడా నివేదికలు ఉండటంతో.. అన్ని అంశాల్లో ఏకాభిప్రాయం కుదిరినట్లుగా తెలుస్తోంది.
చంద్రబాబు ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేస్తారు. పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్తారు. అమిత్ షాతో భేటీ నిర్వహించే అవకాశం ఉంది. అమిత్ పవన్, చంద్రబాబుతో ఒకే సారి కాకుండా విడివిడిగా సమావేశం కావడం కూడా రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. తాము టీడీపీతో సీట్లను సర్దుబాటు చేసుకున్నప్పటికీ..బీజేపీతో కలిసే ఉన్నామని జనసేనాని చెబుతున్నారు. తన నిర్ణయానికి జస్టిఫికేషన్ కూడా గతంలో ఇచ్చుకున్నారు. ఇప్పుడు కూడా అదే చెప్పనున్నారు. ఎన్డీఏలో టీడీపీ చేరికపై పవన్ కు అమిత్ షా సమాచారం ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
సీట్ల సర్దుబాటు అంశంపై అమిత్ షా పెద్దగా చర్చించలేదని.. జేపీ నడ్డా మాత్రం కొంత చర్చించారని అంటున్నారు. అసెంబ్లీ కన్నా పార్లమెంట్ సీట్లలో తమ పార్టీ నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తోంది. బలం లేకపోయినా సీట్లను కేటాయిస్తే.. అది వైసీపీకి అనుకూలంగా మారుతుందని.. పరస్పర ఉపయోగం ఉన్న చోట్లే సీట్ల సర్దుబాటు చేసుకుందామని చంద్రబాబు చెప్పినట్లుగా తెలుస్తోంది. రెండు పార్టీలకు కలిపి ఆరు పార్లమెంట్ సీట్లు.. ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమది వరకూ అసెంబ్లీ సీట్లను కేటాయిస్తామని… దానికి సంబంధించిన పూర్తి వివరాలతో నడ్డాకు నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోది.
పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత ఏపీలో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఓ స్పష్టత వస్తుంది. ఏపీ బీజేపీ విషయంలో హైకమాండ్ తీసుకుంటున్న నిర్ణయాలపై .. ఒక్క బీజేపీ నేతకూ సమాచారం లేదని తెలుస్తోంది.