పవన్ కళ్యాణ్ జనసేన చంద్రబాబు భజన సేన అని వైసీపీ తిట్టిపోస్తున్నా టిడిపి మాత్రం ఆయనను రాజకీయంగా తక్కువ అంచనా వేయడం లేదు. పోలవరంపై పవన్ వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకటికిరెండుసార్లు ఖండించడమే దీనికి నిదర్శనం. తను వాస్తవ వ్యూహాలు ఏమిటనేది తేలేవరకూ మన జాగ్రత్తలో మనం వుండాలన్నది టిడిపి ఆలోచనగా చెబుతున్నారు. వారికి అనుకూలంగా వుండే పత్రికల కథనాలు చూసినా ఈ విషయం అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ ఇటీవలి పర్యటనలో అన్న చిరంజీవి గురించి గౌరవంగా మాట్లాడారు గనక జనసేనలో ఆయనకు పెద్ద పదవి ఇస్తారని ఒక పత్రిక కథనం రాసింది. అద్యక్ష పదవినే ఇస్తారన్న సూచన కూడా దానిలో వుంది. రాజకీయ వాస్తవాలు ఏ మాత్రం తెలిసిన వారైనా ఇలా జరిగే అవకాశం లేదని చెప్పగలరు. చిరంజీవి ఈ దశలో తమ్ముడు నియమిస్తే వెళ్లి చేరడం, అన్నను వదులకుని వచ్చానన్న పవన్ ఆయననే పిలిచి పీట వేయడం వూహకందని విషయాలు. అలా చేస్తే ఉభయుల విశ్వసనీయతకూ విఘాతం కలగుతుందని వారికి బాగా తెలుసు. అనుబంధాలు సెంటిమెంట్టు ఎలా వున్నా ప్రజా జీవితంలో కొన్ని పద్దతులు పాటించాలని తెలుసుగనకే రాజకీయంగా ఎవరి భాష వారు మాట్లాడుతున్నారు.ఇలాటి కథనాలు విడుదల చేయడం ద్వారా లేనిపోని వూహలకు అవకాశమిచ్చి తద్వారా పవన్ పెరుగుదలను మొదటే అడ్డుకోవాలన్న ఆలోచన వుందని ఆయన సహాయకులు విమర్శిస్తున్నారు. రాజకీయాల కోసం సినిమాలు పూర్తిగా మానుకోవడం మంచిది కాదని చిరు తమ్ముడికి సలహా ఇచ్చారని వార్తలువస్తుంటే ఆయన మళ్లీ సినిమాలు మానుకుని రాజకీయాల్లోకి అది కూడా అవకాశాలు అస్పష్టంగా వున్న పార్టీలోకి వస్తారని చెప్పడం కాలక్షేపానికి పనికి వస్తుంది. జనసేనను పలచబర్చడం, సామాజికంగా ఒక వర్గాన్ని గందరగోళపర్చడం లక్ష్యాలుగా ఇవన్నీ ప్రచారం చేస్తున్నారనేది జనసేన వర్గాల స్పందనగా వుంది.