ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం వైఖరిని నిరసనగా వైకాపా పిలుపునిచ్చిన బంద్ కు ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతు పలికాయి. కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, లోక్ సత్తా, ఆప్ ఏపీ విభాగాలు ఈ బంద్ కు మద్దతునిచ్చాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ బంద్ కు రీజన్ ను కూడా పట్టించుకోకుండా, తెలుగుదేశం మాత్రం ఈ బంద్ కాల్ ను వ్యతిరేకించింది. వైకాపా ఏదో తన పార్టీ విషయంలో కాకుండా.. రాష్ట్రం విషయంలో నిరసన తెలిపినా కూడా తెలుగుదేశం వాళ్లు తగ్గలేదు.
అసలు ఈ కాలంలో బంద్ లేమిటి? అంటూ కొంతమంది తెలుగుదేశం నేతలు వ్యాఖ్యానించడం విశేషం. మొన్నటి వరకూ తెలుగు రాష్ట్రం బంద్ లతో అట్టుడికింది. సమైక్యాంధ్ర, తెలంగాణ ఉద్యమాలతో నెలలు నెలలు పాలన, రాష్ట్రం స్తంభించిపోయింది. అప్పుడు అన్ని పార్టీలూ బంద్ లకు మద్దతు పలికాయి. అయితే తాము అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన ఈ బంద్ కాల్ ను తెలుగుదేశం వాళ్లు వ్యతిరేకిస్తున్నారు. దివాకర్ రెడ్డి అయితే మరో అడుగు ముందుకు వేసి.. బంద్ కు పిలుపునిచ్చిన వారిని తరిమి తరిమి కొట్టాలని అన్నాడు! ఈయన నోటికి హద్దులేమీ ఉండవు కాబట్టి.. ఈయన ఇలాగే మాట్లాడుతాడు అనుకోవచ్చు.
అలాగే.. తెలుగుదేశం అనుకూలురు కూడా సోషల్ సైట్లలో బంద్ ను వ్యతిరేకించడం గమనార్హం. బంద్ విజయవంతం అయితే జనాలు ఎక్కడ వైకాపా తరపున ఉన్నారనే అభిప్రాయం కలుగుతుందో అని తెలుగుదేశం వాళ్లు భయపడ్డారు కాబోలు. ప్రత్యేక హోదా విషయంలో కూడా బంద్ ను వీరు సమర్థించడం లేదు. జపాన్ తరహా నిరసన అనేది తెలుగుదేశం వాళ్లు ఇప్పుడు వినిపిస్తున్న మాట. మరి నిరసన తెలపడంలో కూడా విదేశీ విధానాలను అరువు తెచ్చుకోవడమేనా? అనే విమర్శ వస్తున్నా తెలుగుదేశం వాళ్లు ఓవర్ ప్రొడక్టివిటీ ద్వారా నిరసన అంటున్నారు. అయినా.. అధికారంలో ఉన్నప్పుడు ఇంతకు మించి మార్గమేముందిలే!