పోలింగ్ ముగియగానే పనైపోయిందని అనుకోవడం లేదు…టీడీపీ. కౌంటింగ్ పై దృష్టి పెట్టింది. ఏ చిన్న అక్రమం జరగకుండా… వందల మందికి ట్రైనింగ్ ఇస్తోంది. కౌంటింగ్ హాల్లోకి ఏజెంట్లుగా వెళ్లేవారికి.. అన్ని రకాలుగా అవగాహన కల్పిస్తున్నారు. కౌంటింగ్లో ఎలాంటి అక్రమాలు జరుగుతాయో… కళ్లకు కట్టినట్లుగా వివరించి… ఎలా ఎదుర్కోవాలో వివరిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ… మొదటి నుంచి ఈసీ తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉంది. వైసీపీ ప్లాన్లో భాగంగా కొన్ని లక్షల ఓట్ల తొలగింపునకు.. ఈసీ కూడా సహకరించేందుకు సిద్ధమయిందని.. టీడీపీ వాదన. అందుకే ఫామ్-7లు పెట్టిన వైసీపీ నేతల ఐపీ అడ్రస్లు ఇవ్వలేదని చెబుతోంది. వైసీపీకి పూర్తి స్థాయిలో ఈసీ సహకరిస్తున్నందున.. మరింత జాగ్రత్తగా ఉండాలని… టీడీపీ భావిస్తోంది. పోలింగ్ రోజు ఈవీఎంల మొరాయింపు, అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పోలింగ్ జరగడంతో అనుమానాలు ఎక్కువగానే ఉన్నాయి. అందుకే.. వందల మందికి శిక్షణ ఇస్తున్నారు. కౌంటింగ్లో ప్రతీ టేబుల్ వద్దా… ఉండే వారికి అవగాహన కల్పిస్తున్నారు.
టెక్నికల్ అంశాలపై… టీడీపీ ఎక్కువగా దృష్టి పెట్టింది. పోలింగ్ తేడాలు ఏ మాత్రం ఉన్నా… అంగీకరించకూడదని.. నిర్ణయించుకుంది. ఈ మేరకు.. ఇప్పటికే.. బూత్ల వారీగా అభ్యర్థుల నుంచి సేకరించిన 17ఏ, 17సీ ల మధ్య వ్యత్యాసం, ఫాం-18, ఫాం-19, ఫాం-20లకు సంబంధించి పూర్తి వివరాలను కౌంటింగ్ ఏజెంట్లకు వివరిస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల కౌంటింగ్లో లాయర్లే ఎక్కువగా కనిపించబోతున్నారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద పార్టీ తరపున న్యాయవాది, సాంకేతిక నిపుణుడిని అందుబాటులో ఉంచుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, ఈవీఎంలు, వీవీప్యాట్లు కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఫారం-20పైన సంబంధిత అధికారి కౌంటింగ్ వివరాలను సమగ్రంగా నమోదు చేసి, అభ్యర్థిని ప్రకటించేవరకు అక్కడే కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉండాల్సిందేనని చెబుతున్నారు.
వీవీ ప్యాట్ స్లిప్పుల సంఖ్య ఈవీఎం లో ఓట్లకు సరిపోకుంటే ఆ బూత్ లో మొత్తం కౌంటింగ్ ను వాయిదా వేయాలని, లేదా అన్ని వీవీప్యాట్లు లెక్కించాలని టీడీపీ కొరనుంది. పార్టీ అభ్యర్థికి మెజార్టీ రాకపోయినా ప్రతి రౌండ్ లోనూ ఓట్లు నమోదు చేయడం, అభ్యంతరాలు ఉంటే లిఖిత పూర్వకంగా సంబంధిత అధికారికి ఫిర్యాదు చేయటం చెప్తోంది. ఇవన్నీ.. ఈవీఎం అవకతవకల్ని నిరూపించడానికి పక్కా సాక్ష్యాలుగా ఉంటాయన్న భావన టీడీపీలో వ్యక్తమవుతోంది. ఏ చిన్న అవకతవక తేలినా… మొత్తం గుట్టు బయట పెడతామంటున్నారు.