ప్రచారానికి ఇంకా మూడు రోజులు మాత్రమే గడువు ఉంది. అంటే, ఇకపై మైక్ లకు పని ఉండదు. ఉండేదంతా ఓటు మేనేజ్ మెంటే. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీకి బాగా పట్టుందనే చెప్పాలి. ఇంతకీ ఓటు మేనేజ్మెంట్ అంటే ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా! ఇది అత్యంత కీలక దశ కాబట్టి, ఎన్నిక దగ్గర పడుతున్న ఈ తరుణంలో వైకాపా శ్రేణులపై తెలుగుదేశం పార్టీ గట్టి నిఘా పెట్టించినట్టు సమాచారం. నంద్యాలలో టీడీపీ శ్రేణులు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయనీ, వైకాపా శ్రేణుల ప్రతీ కదలికపైనా దృష్టి సారించాయని చెబుతున్నారు. ముఖ్యంగా డబ్బు పంపిణీ జరగకుండా ఉండేలా కాపలా కాస్తున్నాయని తెలుస్తోంది. ఈ విషయంలో పోలీసుల సాయాన్ని అధికార పార్టీ తీసుకుంటోంది. నంద్యాలలో తాజాగా ఓ ఇరవై మంది వైసీపీ కార్యకర్తలు డబ్బులు పంచుతూ దొరికిపోయారు. వారి దగ్గర కొంత సొమ్ము కూడా ఉంది. వీరిని పట్టించింది అధికార పార్టీ కార్యకర్తలే అని అంటున్నారు. ఇలానే నంద్యాలలోని అన్ని ప్రాంతాల్లోనూ టీడీపీ పటిష్ఠమైన నెట్ వర్క్ ఏర్పాటు చేసిందని ప్రచారం జరుగుతోంది. ఓటు మేనేజ్ మెంట్ చేయాల్సిన ఈ కీలక దశలో వైకాపాకి టీడీపీ బాగానే కట్టడి చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
క్షేత్రస్థాయిలో ఇలా ఉంటే, పైస్థాయిలో వైకాపాపై ఎన్నికల సంఘానికి టీడీపీ నేతలు ఫిర్యాదులు చేశారు. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఓటర్లకు డబ్బులు పంచుతున్నారనీ, ప్రజలకు కొన్ని స్లిప్పులు ఇచ్చి, శిల్పా సహకార సంస్థ వద్ద సొమ్ము ఇస్తున్నారంటూ టీడీపీ నేతలు ఎన్నిక సంఘానికి ఎమ్మెల్సీ జనార్థన్ లేఖ రాశారు. హైదరాబాద్ లోని ఎన్నిక సంఘం కార్యాలయానికి ఆయనతోపాటు, ఎంపీ కేశినేని నాని కూడా వెళ్లారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా నంద్యాలలో వైకాపా సొమ్ము పంచుతోందని ఆరోపించారు. ఎంపీ నాని మాట్లాడుతూ… నంద్యాల ప్రాంతంలో హింసను ప్రేరేపించే విధంగా జగన్ ప్రసంగాలు ఉంటున్నాయంటూ ఫిర్యాదు చేశామన్నారు. ముఖ్యమంత్రి స్థాయి నేతను ఉరి తీయమని చెప్పడం, కాల్చి చంపమని అనడం… ఫ్యాక్షన్ ప్రాంతమైన రాయలసీమలో ఇలా మాట్లాడటం హింసను ప్రేరేంపించడమే అవుతుందని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్టు నాని చెప్పారు.
మరోవైపు వైకాపా కూడా ఇదే తరహాలో ఫిర్యాదు చేయడం విశేషం! అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నంద్యాలలో డబ్బు పంచుతోందని ఆరోపిస్తోంది. ఏదేమైనా, నంద్యాలలో ఎన్నికలు సమీపించే సమయానికి బూత్ స్థాయి ఓటు మేనేజ్మెంట్ నుంచీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు వరకూ టీడీపీ ఎక్కడా ఏ అవకాశాన్నీ వదలడం లేదు. నిజానికి, బూత్ స్థాయి సమీకరణలపైనే పార్టీలు దృష్టి సారించాల్సిన కీలక సమయమిది. ఇలాంటి తరుణంలో వైకాపాను ఉక్కిరిబిక్కిరి చేయాలన్నది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది.