పార్లమెంటరీ రాజకీయాల్లో సంఖ్యాబలానికి వున్నంత మహిమ ఎంతంటే? ఎంతవాడుకోగలిగితే అంత! ఈ సూత్రాన్ని అర్ధంచేసుకోవడమే తెలుగుదేశం జాతీయపార్టీగా విస్తరించడానికి మూలం. ఈ పార్టీ జాతీయపార్టీ గా నమోదైన వెంటనే అండమాన్, నికోబార్ దీవుల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రెండు స్థానాల్లో గెలుపొందింది. ఈ పదవులు చిన్నవే కావచ్చు అయినా కూడా దూరతీరాల్లో తెలుగుదేశం ఉనికని అధికారికంగా చాటిచెబుతున్నాయి.
అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో 42 లోక్ సభా స్ధానాలు వున్నపుడు అందులో గరిష్టంగా 35 సీట్లను 1985 ఎన్నికలలో తెలుగుదేశంగెల్చుకుని చక్రంతిప్పింది. రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ స్ధానాలు 25 మాత్రమే వున్నాయి. అన్నిసీట్లనూ తెలుగుదేశమే గెల్చుకున్నాకూడా జాతీయ రాజకీయాల్లో 85 నాటి ప్రాభవం వచ్చే అవకాశమేలేదు. రాష్ట్రవిభజన కారణంగా తెలుగుదేశం పార్టీని సంస్ధాగతంగా నష్టపరచిన ఈ పరిస్ధితి నుంచి బయట పడటానికే తెలుగువారి ఉనికి, పలుకుబడి వున్న అన్నిరాష్ట్రాలకూ విస్తరించి మరికొన్ని లోక్ సభ స్ధానాలను గెలుచుకోవడం కోసమే జాతీయ పార్టీగా ఆపార్టీ నమోదైంది. 1982 మార్చి 29న ఆవిర్భవించి, 33 ఏళ్ళ తరువాత జాతీయవేదిక మీద కాలుమోపేసరికి 54 లక్షల మంది సభ్యులు నమోదైవుండటం తెలుగుదేశం పార్టీకి గొప్ప పరిచయవాక్యమౌతోంది. కాంగ్రెస్ ఓటమే ధ్యేయంగా పెట్టుకున్న తెలుగుదేశం వ్యవస్ధాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 1986 లో హర్యా నా, నాగాలాండ్, అస్సాం, తమిళనాడు, కర్నాటక, హర్యానా రాష్ట్రాలలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చేశారు.
1989 సాధారణ ఎన్నికల నాటికి ఎన్టీఆర్ అధ్యక్షుడిగా జాతీయస్థాయిలో కాంగ్రెస్-బీజేపీయేతర 14 పార్టీలతో నేషనల్ ఫ్రంట్‌ను ఏర్పాటుచేసి కాంగ్రెస్‌ను ఓడించి ఢిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకుంది. నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్ అయిన ఎన్టీఆర్… వీపీ సింగ్‌ను ప్రధాన మంత్రిగా, దేవీలాల్‌ను ఉప ప్రధానిగా ఎంపిక చేయడంలో కీలకపాత్ర పోషించారు. అప్పటి కేంద్ర ప్రభుత్వంలోఉన్న భాగస్వామ్య పక్షాల మధ్య ఏవిధమైన అభిప్రాయ భేదాలు, సమస్యలు ఏర్పడినా ఎన్టీఆర్ హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి ఆ సమస్యలను పరిష్కరించేవారు. అపుడే మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశానికి చెందిన ఆరుగురు మంత్రులు భాగస్వామ్యం వహించారు. తర్వాత చంద్రశేఖర్‌ను ప్రధాన మంత్రిగా చేయటానికి మద్దతు తెలియజేశారు. ఈ విధంగా ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలో విజృంభించి కాంగ్రెస్ కట్టుకున్న కోటలను కూల్చివేసింది.
1995 తరువాత బీజేపీ – కాంగ్రెసేతర పార్టీలతో చంద్రబాబు తృతీయ ఫ్రంట్‌ను ఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఈ ఫ్రంట్ ద్వారా ఢిల్లీలో అధికారం చేజిక్కించుకున్నారు. అప్పుడు ప్రధానిగా ఎవరిని ఎంపిక చేయాలనే బాధ్యతను తృతీయ ఫ్రంట్ నాయకులు చంద్రబాబుకు అప్పగించారు. దేవెగౌడ, ఐకె గుజ్రాల్‌లను ప్రధాన మంత్రులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపిక చేశారు. ఆ సమయంలో ఢిల్లీ రాజకీయాలలో చంద్రబాబు ప్రముఖ పాత్ర పోషించటం ద్వారా రాజకీయాలు తెలుగుదేశం చుట్టూ తిరిగాయి. 1996లో చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇచ్చింది. 1998లో లోక్‌సభలో తెలుగుదేశం నాయకుడు జీయంసీ బాలయోగి స్పీకర్‌గా వ్యవహరించారు. తరువాత 1999లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎన్డీయే కూటమితో కలిసి పోటీచేసి ఘనవిజయం సాధించారు. అప్పుడు ఢిల్లీలో ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు తెలిపి జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం మరోసారి కీలక పోషించింది. 2014లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ ఎన్డీయే కూట మితో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన తెలుగుదేశం ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో తెలుగుదేశం చేరి రెండు మంత్రి పదవులు స్వీకరించింది.
రెండు తెలుగు రాష్ట్రాలు కాక దేశంలోని ఇతర రాష్ట్రాల్లో తెలుగువారు గణనీయ సంఖ్యలో ఉన్నారు. ప్రపంచంలోనే 16వ స్థానంలో తెలుగు భాష ఉన్నది. దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా తెలుగు మాట్లాడే ప్రజలే ఉన్నారు. స్వాతంత్య్రానికి పూర్వం తెలుగువారికి మద్రాసు రాజధానిగా ఉండేది. తెలుగువారిక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కూడా అనేక లక్షల మంది తెలుగువారు ఇప్పటికీ చెన్నైలోనే నివసిస్తున్నారు. కర్నాటకలోని బళ్లారి, రాయచూర్, బీదర్, పాలార్, హసన్ ప్రాంతాల్లో అత్యధిక సంఖ్యాకులు తెలుగువారే. ఒడిషాలోని పెరంబూర్, రాజాం, ఇచ్ఛాపురంలలో,మహారాష్టల్రోని ముంబాయి దగ్గర వర్లి, నాందేడ్, షిరిడి, అజంతా, నాగపూర్ ప్రాంతాల్లో, రాజస్థాన్‌లో, ఢిల్లీలోని ఆర్కేపురం, నోయిడా ప్రాంతాల్లో తెలుగువారి ప్రాబల్యం వుంది. ముంబాయిలోని వర్లి ప్రాంతంలో గణనీయ సంఖ్యలో తెలుగువారు ఎన్టీఆర్ విగ్రహాన్ని నెలకొల్పుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారికి ఎటువంటి కష్టాలొచ్చినా వారు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తారు.
ఆయా రాష్ట్రాల్లో స్ధానిక రాజకీయ సమీకరణలకు అనుగుణంగా తెలుగుదేశం పోటీ చేసినట్లయితే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ఒక ప్రాంతానికే పరిమితమైన ఎంఐఎం మహారాష్టల్రో జరిగిన ఎన్నికల్లో రెండు ఎమ్మెల్యే స్థానాలను గెలుపొందింది. ప్రస్తుతం జరుగుతున్న బీహార్ ఎన్నికల్లో సైతం ఆ పార్టీ పోటీకి దిగి తన ఉనికిని చాటుకోవటానికి ప్రయత్నిస్తున్నది. అటువంటిది టీడీపీ లాంటి పెద్దపార్టీ ఇతర రాష్ట్రాల్లో పోటీకి దిగితే ఎంతోకొంత సంఖ్యాబలం పెరుగుతుంది. లోక్ సభలో సంఖ్యాబలం పెంచుకోవడం ద్వారా రాష్ట్రానికి కావాల్సిన నిధులు మరింతగా సాధించుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది. 1999లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలుగుదేశం మద్దతుపై ఆధారపడి కొనసాగింది. అప్పటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి దేశంలోనే అత్యధికంగా పనికి ఆహారం బియ్యం, 20లక్ష్టల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది. అవి కేంద్రంలో చంద్రబాబు హవా నడచిన రోజులు. జాతీయ పార్టీగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు అధ్యక్షుడిగా ఉంటూ, రెండు తెలుగు రాష్ట్రాలకు వేరువేరు కమిటీ లను ప్రకటించించారు. రెండు రాష్ట్రాలకు 17మందితో అత్యున్నత పొలిట్ బ్యూరోను ప్రకటించించారు ఆంధ్రప్రదేశ్‌కు కళా వెంకటరావును అధ్యక్షుడిగా ఎంపిక చేయగా, తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎల్.రమణను కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు 70 మందితో తెలంగాణాకు 95 మందితో కమిటీలను నియమించారు.
తెలుగుదేశంలో చేరినపుడు చంద్రబాబు ను పార్టీ ప్రధాన కార్యదర్శులలో ఒకరిగా ఎన్ టి ఆర్ నియమించారు.పార్టీ జాతీయపార్టీగా మార్పు చెందాక ఇపుడు చంద్రబాబు కుమారుడు లోకేష్ ను జాతీయ ప్రధాన కార్యదర్శులలో ఒకరిగా చంద్రబాబు నియమించారు.