తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి ఊపందుకుంటోంది. పొత్తులుపై ఇంకా ఏ పార్టీ కూడా దృష్టి సారించలేదు కానీ.. ఎత్తుల విషయంలో మాత్రం… దాడి దన్నేవాడుంటే.. వాడి తలదన్నేవాడొకడుంటాడు అన్నట్లుగా వ్యూహాలు అమలు చేస్తున్నారు. రాజకీయాల్లో ఉంటే.. ఎవరి లక్ష్యమైనా.. ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయడమే. అందు కోసం ప్రధాన పార్టీల్లో టిక్కెట్ సంపాదించాలి. అంతో ఇంతో అంగ, అర్థబలం ఉన్న నేతలు…ఇప్పుడు… సేఫ్ పార్టీ కోసం… టిక్కెట్ కన్ఫర్మ్ చేసే పార్టీ కోసం వెదుక్కుంటున్నారు. పార్టీల అవసరాలను బట్టి వారికి చాన్సులు దొరుకుతున్నాయి.
రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీలు ఎప్పుడో ఆపరేషన్ ఆకర్ష్ ను దిగ్విజయంగా పూర్తి చేశాయి.ఇప్పుడు రెండు అధికార పార్టీల్లో ఓవర్ లోడ్ అయింది. ఇక ముందు ఆ పార్టీల్లో చేరే వారి కన్నా.. బయటకు వెళ్లేవారే ఎక్కువ ఉండొచ్చు. రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు హవా అంతా ప్రతిపక్ష పార్టీలదే. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు బలమైన అభ్యర్థుల కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది. తమకు బలమైన నేత లేడు అనుకున్న చోట… ప్రత్యర్థి పార్టీకి షాక్ ఇవ్వగల నేత అనుకున్నప్పుడు.. వెంటనే టిక్కెట్ ఖరారు చేసి… పార్టీలోకి తీసుకోవడానికి ఏమీ వెనుకడుగు వేయడం లేదు. యలమంచి రవి ఇప్పటికే పార్టీలో చేరిపోయారు. కన్నా లక్ష్మినారాయణ, కావూరి సాంబశివరావు, కాటసాని రాంభూపాల్ రెడ్డి.. ఇలా లిస్ట్ చాలా పెద్దదే. అయితే ఇది ప్రారంభ స్టేజ్ నే. ఎన్నికల వాతారవణం దగ్గరపడి..టిక్కెట్ల రేసులో వెనుకబడతామనుకున్న అధికార పార్టీ నేతల్లో ఎక్కువ మంది .. విపక్షం వైపు చూసే అవకాశం ఉంది.
తెలంగాణలో అధికార పార్టీ ఆకర్ష్ దెబ్బకు ఇతర పార్టీలు దాదాపు తుడిచిపెట్టుకుపోయినంత పనయింది. ఇప్పుడు ఆ అవకాశం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. రేవంత్ రెడ్డి చేరికతో..జాక్ పాట్ కొట్టిన కాంగ్రెస్… ఆ తర్వాత వరుసగా మాజీ టీడీపీ నేతల్ని చేర్చుకుంటూనే వెళ్తోంది. తాజాగా నాగం జనార్ధన్ రెడ్డి చేరారు. నాగం, రేవంత్ ఇద్దరూ వేర్వేరు సందర్భాల్లో తెలుగుదేశం పార్టీలో నెంబర్ టూ పొజిషన్ ను… ఎంజాయ్ చేసిన వాళ్లే. కొండా సురేఖ రేపో మాపో కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమని ఇప్పుడే పుకార్లు వస్తున్నాయి. ఈ జాబితాలో ముందు ముందు మరికొంత మంది ప్రముఖ నేతల పేర్లూ వినిపించిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
నియోజకవర్గాల సంఖ్య పెంపు లేకపోవడం అధికార పార్టీలకు షాక్ లాంటిది. భారీగా చేర్చుకున్న నేతలకు అవకాశం ఇవ్వకపోతే..వారు హ్యాండ్ ఇవ్వడం ఖాయం. ఈ పరిస్థితిలో ఏపీలో, తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షాలే లాభపడుతున్నాయి. ఇప్పుడు నష్టపోతోంది కూడా అధికార పార్టీలు కాదు. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీనే ఎక్కువగా నష్టపోతోంది. ఆరెస్సెస్ నేపధ్యమనున్న నేతలు మాత్రమే..బీజేపీని అంటిపెట్టుకుని ఉంటున్నారు. మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే ముంచేసి వెళ్లిపోతున్నారు. అయితే ముందు ముందు..ఈ వలసల గండం..అధికార పార్టీలకే ఎక్కువ ఉంది.