తెలుగుదేశం పార్టీ వారు ప్రకటించిన డెడ్‌లైన్ అచ్చంగా కార్యరూపంలోకి వస్తుందో లేదో తెలియదు. కాకపోతే జగన్ చుట్టూ ఇంకా ఉచ్చు బిగించడం మాత్రం తెలుగుదేశం పార్టీ మానినట్లు కనిపించడం లేదు. తనేమో తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూల్చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని అందుకని పాలక పక్షం నుంచి కేవలం 21 మంది ఎమ్మెల్యేలు తన పార్టీలోకి వచ్చేస్తే చాలునని జగన్ తన అవగాహన రాహిత్యం మొత్తం బయటపెట్టుకుంటూ మాట్లాడారు. అయితే ఆ మాటలతో రెచ్చిపోయి.. వైకాపా పతనానికి కంకణం కట్టుకున్న తెలుగుదేశం పార్టీ వైకాపా వికెట్లు తీయడంలో హాఫ్ సెంచరీ చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. జగన్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోతుంది అని డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించడం గమనిస్తే వారి ఉద్దేశం మనకు స్పష్టం అవుతుంది.
తెలుగుదేశం పార్టీ ఈ లక్ష్యసాధనలో సఫలం అవుతుందా లేదా? అనేది వేరే సంగతి. కానీ యాభైమంది ఎమ్మెల్యేలను ఫిరాయించేలా చేయడం కాకపోయినప్పటికీ ఆ మోతాదులో వైఎస్సార్ కాంగ్రెస్‌కు భారీ నష్టం కలిగించడం మాత్రం తథ్యం అని పలువురు భావిస్తున్నారు. నేను అనుకుంటే గంటలో ఈ ప్రభుత్వం కూలిపోతుంది అనే డైలాగును ప్రయోగించడం ద్వారా తెలుగుదేశం వ్యూహకర్తలను అందరినీ జగన్ చాలా రెచ్చగొట్టాడనే సంగతి స్పష్టం.
ఇప్పుడు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కూడా అదే అంటున్నారు. మెజారిటీ తక్కువ ఉన్న జగన్, ప్రభుత్వాన్ని కూల్చేయడానికి సిద్ధమవుతూ ఉంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా? అని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా లేకుండా చేసేందుకు తాము నిర్ణయం తీసుకున్నాం అని ఆయన ఓపెన్‌గా చెప్పేస్తున్నారు. కేఈ మాటల్లో దాపరికం ఉండడం కూడా లేదు. మొన్నటికి మొన్న కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ వచ్చినప్పుడు కూడా మీ నాన్న తెదేపాలో ఉండగా.. మేం ఎంత హెల్ప్ చేశామో అంతా వివరించి చెప్పేసరికి ఆయన రావడానికి ఒప్పుకున్నారు అని స్వయంగా కేఈ చెప్పుకొచ్చారు. ఇలా ఒక్కొక్క ఎమ్మెల్యే మీద ఒక్కొక్క రకం అస్త్రాన్ని ప్రయోగిస్తున్నట్లు కనిపిస్తోంది. కాకపోతే వైఎస్సార్ కాంగ్రెస్‌లో తమ టార్గెట్ హాఫ్ సెంచరీ వికెట్లు పడగొట్టడం అనే సంకేతం ఆయన ఇవ్వాళే బయటపెట్టారు. ప్రతిపక్షహోదా లేకపోవడం అంటే.. పది శాతం సీట్లు కూడా ఉండకూడదు. 175 సీట్ల ఏపీ అసెంబ్లీలో హోదా కోల్పోవడం అంటే 18 సీట్లకంటె తక్కువ ఉండాలి. అంటే 67 సీట్ల వైకాపాలో 50 మందిని ఫిరాయింపజేస్తే తప్ప ఆయన చెబుతున్నట్లుగా జరగదు. మరి ఆయన మాటలు ఎలా సాధ్యమవుతాయో వేచి చూడాలి