రాజ్యసభ ఎన్నికల విషయంలో టీడీపీ పక్కా ప్లాన్ తో ఉంది. అభ్యర్థిని పెడితె గెలిచి తీరాలన్న లక్ష్యంతో ఉంది. ఆ దిశగానే కసరత్తు చేస్తోంది. రాజ్యసభ ఎన్నికలపై ఓ టీమ్ ఇప్పటికే సమన్వయం చేసుకుంటోంది. పార్టీ బలం ఎంత.. ఎంత మంది ఎమ్మెల్యేలు టీడీపీకి అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉంది.. వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని .. వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కొంత మంది ఎమ్మెల్యేలు స్వచ్చందంగా తాము ఓటేస్తామని ముందుకు వచ్చారు. మరికొంత మందితో టీడీపీ నేతలు చర్చలు జరుపుతున్నారు. కొంత మంది ఎమ్మెల్యేలు జనసేన చీఫ్ తో టచ్ లోకి వచ్చారు. అన్నీ అంశాలను అధ్యయనం చేస్తున్నారు.
పోటీ అంశం.. ఎవరు పోటీ చేస్తారన్న దానిపై చివరి వరకూ గుట్టుగానే ఉంచాలనుకుంటున్నారు. టీడీపీ తరపున పోటీ చేస్తే.. దళిత నేతను నిలబెట్టే అవకాశాలు ఉన్నాయి. వైసీపీ పూర్తిగా దళిత నేతలని పావులుగా చేసి రాజకీయం చేస్తున్నారు. వారి సీట్లకే టెండర్ పెడుతున్నారు. జగన్ రెడ్డి కసరత్తులో భాగంగా ఇప్పటి వరకూ టిక్కెట్లు ఎగ్గొట్టిన వారిలో 28 మంది రిజర్వుడు నియోజకవర్గాలకు చెందిన వారే ఉన్నారు. వారంతా దళిత అభ్యర్థిని పెడితే మద్దతు ఇచ్చే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.
వైసీపీ కి ఇప్పుడు గడ్డు పరిస్థితి ఉంది. జగన్ రెడ్డి మార్పు చేర్పులు చేసిన సీట్లు మినహా … మిగతా అన్ని చోట్లా అందరికీ ఖాయం అని చెప్పడం లేదు. ఆముదాల వలస వంటి చోట్ల వేరే అభ్యర్థిని ఖరారు చేసినా.. కొన్ని కారణాల వల్ల ప్రకటించడం లేదు. ఇలా చాలా చోట్ల నియోజకవర్గాల్లో మార్పు చేర్పులకు రెడీ అయినా… రాజ్యసభ ఎన్నికల కారణంగా ఆపేశారు. వీరంతా.. ధిక్కరించే అవకాశం ఉన్న ఎమ్మెల్యేలుగానే భావిస్తున్నారు. ఆవేశంలో అయినా వీరంతా పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తారన్న అనుమానాలు ఉన్నాయి. అందుకే టీడీపీ వ్యూహాలేమిటో.. ఆ పార్టీతో ఎవరెవరు టచ్ లోకి వెళ్లారన్న దాన్ని తెలుసుకునేందుకే అత్యధిక సమయం కేటాయిస్తున్నారు.