తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా ఇటీవలి కాలంలో రెండో సారి హ్యాక్‌కు గురైంది. మొదటి సారి అసభ్య పోస్టులు పెట్టారు. రెండో సారి అసభ్యత లేదుకానీ.. టీడీపీ సోషల్ మీడియా డొల్లతనాన్ని బయట పెట్టింది. రెండు సార్లు వైఎస్ఆర్సీపీకి చెందిన వారు హ్యాక్ చేశారని ప్రచారం చేసుకున్నారు. కానీ అలా వారు చేయగలిగేంత అతి తక్కువ సెక్యూరిటీతో ట్విట్టర్ ఖాతాను నడుపుతున్నారంటే అంత కంటే చేతకాని తనం మరొకటి ఉండదు.
ఇతర ఖాతాల హ్యాక్ అయితే సీరియస్ గా తీసుకోరు కానీ అది టీడీపీ అధికారిక హ్యాండిల్. నిజానికి ఇలా హ్యాక్ కావడం ప్రధానమంత్రి ఖాతాలకూ తప్పలేదు. ఓసారి మోదీ ఖాతాను హ్యాక్ చేసి రాత్రికి రాత్రి క్రిప్టో కరెన్సీలకు అనుమతులిస్తున్నట్లుగా ప్రకటనలు చేసేశారు. తర్వాత కవర్ చేసుకున్నారు. ప్రధాని ఖాతానే హ్యాక్ చేయగలిగినప్పుడు టీడీపీ ఖాతా ఎంత అనేడౌట్ రావొచ్చు. కానీ ఎవరి ఖాతా అయినా సెక్యూరిటీ ఫీచర్స్ కరెక్ట్ గా పెట్టుకుంటే ఎవరూ హ్యాక్ చేయలేరు.
కానీ పెగాసస్‌తో పాటు దానికి వంద రెట్లు సామర్థ్యం ఉన్న నిఘా వ్యవస్థలను ఇప్పుడు రాజకీయ పార్టీలు.. వాడుతున్నాయి. ఆ నిఘా న్యవస్థ సాయంతో హ్యాక్ చేయడం పెద్ద కష్టం కాదు .కానీ వాటి నుంచీ కాపాడుకోవాలి. లేకపోతే దేనికీ రక్షణ లేకుండా పోతుంది. ఇప్పుడు ట్విట్టర్ ఖాతాలే. రేపు బ్యాంక్ ఖాతాలే ఆ జాబితాలో ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.