తెలుగుదేశం పార్టీ మళ్లీ యూటర్న్ తీసుకుందని…కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏలో ఇక భాగస్వామిగా ఉండబోదని.. చెబుతున్నారని.. విజయసాయిరెడ్డి ఓ ట్వీట్ చేశారు. దాన్ని వైసీపీ నేతలు.. అదో పెద్ద విశేషం అయినట్లుగా చెప్పుకోవడం ప్రారంభించారు. అసలు టీడీపీ.. యూపీఏలో ఎప్పుడు భాగస్వామిగా చేరిందనే విషయం.. విజయసాయిరెడ్డికి తెలియక కాదు..! టీడీపీ ఏ కూటమిలోనూ.. గత ఎన్నికల్లో లేదు. అయితే.. బీజేపీని మాత్రం బహిరంగంగా వ్యతిరేకించి.. కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతిచ్చిన మాట కూడా వాస్తవమే. కానీ అధికారికంగా యూపీఏ కూటమిలో చేరలేదు. బయటకు వచ్చేస్తుందన్న అంశం.. అలాంటప్పుడు చర్చకు రాదు.
బీజేపీపై విమర్శలు చేయకపోతే కుమ్మక్కవుతున్నట్లేనా..?
భారతీయ జనతా పార్టీపై.. విమర్శలు చేయకూడదని.. టీడీపీ నిర్ణయించుకున్నదన్నట్లుగా.. విజయసాయిరెడ్డి ప్రకటించుకొచ్చారు. అందుకే.. యూటర్న్ తీసుకున్నారని ఆయన అంటున్నారు. నిజానికి .. టీడీపీ.. ఏపీలో వైసీపీపై కూడా.. ఆరు నెలల పాటు విమర్శలు చేయకూడదని నిర్ణయించుకుంది. అందుకే.. రూ. 20, 30 వేల కోట్ల రూపాయల విలువైన భవనాలు… తెలంగాణకు.. కనీసం కేబినెట్ భేటీ లో చర్చించకుండా ఇచ్చేసినా.. సైలెంట్ గా ఉండిపోయింది. అంతే కాదు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో… ఏపీ ప్రభుత్వ మెతకవైఖరిపైనా.. అంతే ఉంది. కేవలం.. టీడీపీ నేతలపై జరుగుతున్న దాడులపైనే… ప్రస్తుతం స్పందిస్తున్నారు. ప్రభుత్వ పనితీరును ఇంకో..ఆరు నుంచి ఏడాది పాటు చూడాలనుకుంటున్నారు. ఆ తర్వాతే పోరాటం ప్రారంభించే అవకాశం ఉంది. బీజేపీ విషయంలోనూ అదే పాటిస్తున్నారు. అలాంటప్పుడు.. బీజేపీతో కుమ్మక్కయినట్లతే.. వైసీపీతో అయినట్లే కదా..!
మోకరిల్లడం గురించి విజయసాయి దగ్గరే కదా నేర్చుకోవాలి..!
ముగ్గురు ఎంపీలతో.. టీడీపీ ఢిల్లీలో ఊడబొడిచేదేం ఉండదు. మహా అయితే.. లోక్‌సభలో.. తమకు లభించే అతి కొద్ది సమయాన్ని గట్టిగా ఉపయోగించుకుని మాట్లాడగలరు. ఆ ముగ్గురు తమకు చేతయినయినంత చేస్తారు. చేసినా చేయకపోయినా… పట్టించుకునేవారు ఉండరు. అంత మాత్రాన.. మోకరిల్లడం అయితే.. అది విజయసాయిరెడ్డికే సాధ్యం. ఎందుకంటే.. గత ఐదేళ్లుగా.. ఆయన ఢిల్లీలో .. కాళ్లు మొక్కని బీజేపీ నేత లేరు మరి. ప్రధాని మోడీకి… నిండు సభలో.. కాళ్లు మొక్కారు. పెద్దాయన కాబట్టి గౌరవించాన్నారు. అరుణ్ జైట్లీకి మొక్కారు. అమిత్ షాకు మొక్కారు. రాష్ట్రపతి కాక ముందే రామ్‌నాథ్ కోవింద్‌కు మొక్కారు. జగన్ చేత మొక్కేలా చేశారు. ఇలా మొక్కుళ్లు అలవాటు చేసి.. సీఎం అయిన తర్వాత కూడా.. జగన్మోహన్ రెడ్డి.. ప్రధాని కాళ్లు మొక్కే ప్రయత్నం చేశారు. చివరికి విజయసాయిరెడ్డి.. కాళ్లు కూడా మొక్కారు. అంతగా మోకరిల్లిపోయి.. ఇప్పుడు… చంద్రబాబు మీద.. ట్వీట్లు చేయడానికి ఏ మాత్రం సిగ్గుపడటం లేదు.
సీబీఐ ఎందుకు అరెస్ట్ చేసిందో విజయసాయికి తెలియదా..?
టీడీపీ సమీక్షల్లో.. ఓటమికి కారణాలేమిటో తెలియడం లేదని.. చంద్రబాబు అన్న వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి చిత్రమైన లాజిక్ చెప్పారు. ” దోపిడీలకు పాల్పడిన దొంగ పోలీసులు తనను ఎందుకు అరెస్టు చేశారో తెలియడం లేదన్నట్లు”గా ఉందన్నారు. ఆయన నోటి నుంచి కానీ.. ట్వీట్ నుంచి కానీ… దొంగ అని.. పోలీసులు అని.. జైలు అనే పదం వినిపిస్తే.. ముందుగా… విజయసాయిరెడ్డి పదహారు నెలలు జైల్లో ఉన్న విషయమే ఎవరికైనా గుర్తుకు వస్తుంది. సీబీఐ విజయసాయిరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేసిందో.. ఆయనకు తెలియదా..? ఆయన ఎంత ఫ్రాడ్ చేశాడో.. కళ్ల ముందు కనిపిస్తున్నా… ఎందుకు ఏమీ తెలియనట్లు ఉంటున్నారా..? బోగస్ కంపెనీల పేరుతో కొట్టేసిన భూములు కళ్ల ముందు కనిపిస్తున్నా.. ఎందుకు బుకాయిస్తున్నారు..!
కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు.. విజయసాయిరెడ్డి ట్విట్టర్ దొరికిందని.. టీడీపీ నేతలు.. విమర్శలు చేస్తున్నారంటే… ఆయన ట్వీట్ల స్థాయి ఆ మాత్రంగానే ఉందని.. అర్థం చేసుకోవచ్చు. ఎన్నికలకు ముందు ఇదే ట్విట్టర్ వేదికగా.. ఆయన అత్యంత అసభ్య పదజాలంతో ఆరోపణలు చేశారు. అప్పుడు ఆయన ప్రతిపక్ష నేత. ఇప్పుడు.. అధికారపక్ష నేత… ఇప్పుడూ అవే ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ఇంకా.. అదే మూడ్‌లో ఉన్నారుని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.