ఎపి నాలాబిల్లును ఆమోదించకుండా తొక్కిపడుతున్నారని బిజెపి శాసనసభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు దాడి చేయడం కేవలం తమ వారి వ్యాపార ప్రయోజనాల కోసమేనని తెలుగుదేశం నాయకులంటున్నారు. కొన్నికట్టడాలలో వ్యాపారాలు ప్రారంభించాలంటే ఈ బిల్లులోని కొన్ని నిబంధనలు అవసరం. అయితే గవర్నర్ నరసింహన్ దాన్ని చాలా కాలంగా అట్టిపెట్టుకోవడానికి కారణం కూడా ఆ ఆరోపణలే. ఇది తెలియడం వల్లనే విష్ణు కుమార్ రాజు బహిరంగంగా దాడి చేశారు. అసలు ఆయనను మార్చేయాలని కూడా అడిగేంత వరకూ వెళ్లారు. కంభం పాటి హరిబాబు కూడా ఎపి తెలంగాణలకు వేర్వేరు గవర్నర్లు వుండాలని వత్తాసు పలికారు. ఇదంతా కూడా నాలా బిల్లుకోసం అని అర్థమైన గవర్నర్ ఆమోదం తెలిపి బరువు దించుకున్నారు. బిజెపి వారు గొడవ చాలించారు- ఇది టిడిపి వెర్షన్ నెల్లూరు జిల్లా దుగ్గరాజుపట్నం రేవు అభివృద్ధి విభజన హామీల్లో వున్నా అమలు చేయలేదని టిడిపి వారు ఆరోపించడం అనైతికమని బిజెపి ఎదురుదాడి చేస్తున్నది. స్థానిక టిడిపి నాయకుడు సురేష్ రెడ్డి దానికి అడ్డం తగిలారని వారి వాదన. అసలు తెలుగుదేశం పార్టీకి దుగ్గరాజుపట్నం అభివృద్ధి బదులు కృష్ణపట్నం పైనే కేంద్రీకరించాలని కోరిక. కేంద్రానికి ఆ సంగతి చాలాసార్లు చెప్పినా స్పందన లేదు. దానికి బదులు దుగ్గరాజుపట్నం ప్రారంభించాలంటే ముందు వంద ఎకరాల భూమి చూసుకోవలసిందిగా సలహా ఇచ్చారు. జిల్లాలో వున్న శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం(షార్) అందుకు సమ్మతి తెలిపింది. అయినా ఆ భూమి తీసుకోవడం లేదు. కారణం వారికి ఆసక్తి లేదు.వూరికే ప్రజలను పక్కదోవ పట్టించడం కోసం మాపై నింద మోపుతున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు వివరాలు త్వరలోనే బయిటపెడతాం అని వారు అంటున్నారు.