బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో బీజేపీతో, కాంగ్రెస్ తో తలపడే పరిస్థితి నుంచి దిగజారిపోయింది. ఎన్నికల్లో పోటీ కూడా చేయలేకపోయిన టీడీపీపై పోరాడుతోంది. చంద్రబాబునాయుడు హైదరాబాద్ ర్యాలీ నిర్వహించారని తెగ ఇదైపోతున్నారు. చంద్రబాబు, రేవంత్ భేటీపై రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజకీయం పదేళ్ల కిందటే ఉన్నట్లుగా ఉందనుకుని వారు చేస్తున్న రాజకీయం చూసి ఇంత ఔట్డేటెడా అనుకునే పరిస్థితి.
రేవంత్ రెడ్డితో చంద్రబాబు భేటీని బూచిగా చూపించి ఏదో సెంటిమెంట్ రెచ్చగొట్టేద్దామని తాపత్రయ పడుతున్నారు. కానీ జగన్ రెడ్డితో కేసీఆర్ రాసుకుపూసుకు తిరిగి కూడా చిన్న సమస్యలు పరిష్కరించలేకపోవడాన్ని ప్రజలు ఎలా మర్చిపోగలరు ?. రోజా ఇంట్లో చేపల పులుసు తిని అన్న మాటల్ని కాంగ్రెస్ ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటుంది. సెంటిమెంట్ అనే అస్త్రాన్ని మ్యాగ్జిమం బీఆర్ఎస్ ఇప్పటికే ఉపయోగించేసుకుంది. ఆ పేరుతో చేయకూడని తప్పులన్నీ చేసింది. ప్రజలు మర్చిపోయే పరిస్థితికి వచ్చే సరికి మళ్లీ అదే పనికొస్తుందని అనుకుంటున్నారు.
తమ పేరు బీఆర్ఎస్ అని మార్చుకుని అన్ని రాష్ట్రాల్లో పోటీకి సిద్ధమైన బీఆర్ఎస్… ఇప్పుడు సొంత రాష్ట్రంలోనే ఒక్క సీటు కూడా సాధించలేని స్థితికి వెళ్లిపోయింది. అంటే పునాదులు ఎలా కదిలిపోయాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రత్యర్థి టీడీపీ కాదు.. టీడీపీతో పోటీ పడాలనుకుంటే ఎంపీటీసీ దగ్గరే ఆగిపోవాల్సి ఉంటుంది. బీజేపీతో పోటీ పడాలి. ఎందుకంటే ఆ పార్టీ నే ఇప్పుడు బీఆర్ఎస్కు ముప్పు. ఆ విషయం గుర్తించకుండా… టీడీపీపై ఎగబడితే ఒక్క ఓటు ప్రయోజనం ఉండదు.