కార్పొరేషన్ ఎన్నికలకు ముందు విజయవాడ తెలుగు తమ్ముళ్లు.. తమలో తాము పోటీ పెట్టుకున్నారు. ఎవరు గొప్పో తేల్చుకుందామన్నంతగా పోటీ పడుతున్నారు. ముక్కుసూటిగా రాజకీయం చేసే కేశినేని ఓ డివిజన్లో గతంలో బీఫాం ఇచ్చిన అభ్యర్థిని కాదని… అలిగి వైసీపీలోకి పోయి.. అక్కడ టిక్కెట్ దక్కించుకోలేక మళ్లీ టీడీపీలోకి వచ్చిన నేతకు మరో బీఫాం ఇవ్వడంతో సమస్య ప్రారంభమయింది. ఓ వైపు బుద్దా వెంకన్న, బొండా ఉమ వర్గాలు.. మరో వైపు కేశినేని నాని దూకుడుగా ప్రకటనలు చేస్తున్నారు. కేశినేని నాని కుమార్తె శ్వేత కూడా కార్పొరేషన్ బరిలో ఉన్నారు. ఆమెను మేయర్ అభ్యర్థిగా కేశినేని వర్గం ప్రచారం చేసుకుంటోంది. అయితే బొండా ఉమ వర్గం మాత్రం అలా ప్రచారం చేసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తోంది.
బుద్దా వెంకన్న వర్గం.. తమ వర్గీయుల బీఫాంలను వెనక్కి తీసుకుని వేరేవారికి ఇవ్వడం.. అదీ కూడా వైసీపీలోకి వెళ్లి వచ్చిన వారికి ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తోంది. ఈ వివాదాలపై బుద్దా వెంకన్న, బొండా ఉమ బహిరంగంగా మాట్లాడటం లేదు. వారి అనుచరులు మాట్లాడుతున్నారు. కానీ కేశినేని నాని మాత్రం… చంద్రబాబును కూడా పట్టించుకోను అన్నట్లుగా మాట్లాడేస్తున్నారు. ఎవరైనా తన వెంట నడవాలి కానీ తాను ఎవరి వెంట నడవబోనని ప్రకటించేశారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇరు వర్గాలకు ఫోన్ చేసి.. బహిరంగ ప్రకటనలు చేయవద్దని.. చంద్రబాబు చెప్పినట్లుగా చేద్దామని సూచించారు.
ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్.. చంద్రబాబు నిర్ణయమే తమ నిర్ణయమని చెబుతున్నారు. టీడీపీ ఓడిపోయిన తర్వాత కేశినేని నాని అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో ఆయన టీడీపీకి దూరమయ్యారని అనుకున్నారు. తర్వాత పరిస్థితులు చల్లబడ్డాయి. ఇప్పుడు మళ్లీ విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తన కుమార్తె పోటీకి నిలబెట్టి మేయర్‌ను చేయాలనుకుని రాజకీయం చేస్తున్నారు. తన సొంత బలంతోనే గెలిపించుకుంటానని చెబుతూ.. పార్టీని దాదాపుగా బ్లాక్ మెయిల్ చేస్తున్నంత పని చేస్తున్నారు. దీన్ని టీడీపీ అగ్రనాయకత్వం ఎలా కవర్ చేస్తుందో మరి..!