ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 151 మంది సభ్యులు.. టీడీపీ నుంచి వచ్చిన 4రితో కలిసి తిరుగులేని బలంగా ఉన్న ప్రభుత్వం.. పట్టుమని 20 మంది కూడా ప్రతిపక్షంగా ఎలా ఎదురుదాడి చేయాలన్నదానిపై కసరత్తు చేసి.. అమలు చేస్తోంది. టీడీపీ సభ్యులకు మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదు. లేచి అడిగిన టీడీపీ సభ్యులపై స్పీకర్ దురుసుగా మాట్లాడుతున్నారు. రోజంతా అసెంబ్లీ అదే చోటు చేసుకుంది. తొలి రోజు టీడీపీ పంటల బీమా అంశాన్ని శాసనసభ ద్వారా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో రెండో రోజు వ్యూహం మార్చారు. ఇళ్ల విషయంలో.. టీడీపీకి అసలు చాన్సివ్వకూడదన్న వ్యూహాన్ని అమలు పరిచారు. తొలి రోజు చంద్రబాబు.. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి చాన్సివ్వడంతో సీన్ మారిపోయింది.
ఈ సారి అలాంటి పరిస్థితి రానివ్వకూడదనుకున్నారేమో కానీ… స్పీకర్ తమ్మినేని సీతారాం.. చంద్రబాబుకు మైక్ ఇచ్చేందుకు నిరాకరించారు. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తున్న సమయంలోనూ.. కులాల ప్రస్తావన వచ్చింది. తనకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు పదే పదే అడిగారు. అయితే స్పీకర్ మాత్రం.. చంద్రబాబు బెదిరింపులకు భయపడనని చెప్పుకొచ్చారు. చంద్రబాబు వేలు చూపిస్తే భయపడేదిలేదన్న స్పీకర్ తన చేతిలో ఉన్న పేపర్లు విసిరికొట్టారు. పిల్ల శాపనార్ధాలకు, ఉడత ఊపులకు భయపడనని స్పీకర్ బిగ్గరగా అరిచారు. ప్రతిపక్ష నేత అయితే సో..వాట్ అంటూ కేకలేశారు.
ఆ తర్వాత విపక్ష సభ్యులు పేపర్లు విసిరికొట్టి పోడియం వైపుకు దూసుకొచ్చారు. చివరకు చంద్రబాబుకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఆ సమయంలోనూ చంద్రబాబు స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు. మంత్రులు కన్నబాబు, బొత్స సత్యనారాయణ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. చివరికి … పెద్దగా చర్చ జరగకుండానే… టీడీపీ సభ్యులందర్నీ సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ నుంచి ఒక్క చంద్రబాబును మాత్రం మినహాయించారు. ఉదయమే.. పంటల ఇన్సూరెన్స్ గురించి చర్చకు పట్టుబట్టిన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును సస్పెండ్ చేశారు. సాయంత్రం అందర్నీ పంపేశారు. రెండో రోజు అసెంబ్లీలో స్పీకర్ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా సాగిపోయింది.