శాసనమండలిలో వైసీపీ నేతలు వాలంటీర్ల ప్రస్తావన తీసుకు వచ్చారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చే సరికే వాలంటీర్లు ఎవరూ లేరని తమ ప్రభుత్వం ఎవరినీ తొలగించలేదని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. వాలంటీర్లను అన్యాయం చేసింది వైసీపీనేనని స్పష్టమయింది. అయితే వైసీపీ నేతలు మాత్రం.. టీడీపీ వచ్చిన తర్వాత కూడా వాలంటీర్లు ఉన్నారని ఆరోపించారు.
వాలంటీర్ల వేతనాన్ని రూ.10 వేలు కి పెంచుతామని కూటమి నేతలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థనే లేదని చెప్తున్నారని వైసీపీ నేతలు విమర్శించారు. 2024 సెప్టెంబర్ నెలలో వరదలు వచ్చినప్పుడు వాలంటీర్లతో డ్యూటీ చేయిచారన్నారు. నవంబర్ 2024 వరకు వాళ్లకి సీ ఎఫ్ ఎం ఎస్ ఐడీలు కొనసాగించారన్నారు. కూటమి ప్రభుత్వం 2,56,000 మంది వాలంటీర్ల ఉద్యోగాలు తొలగించిందని వైసీపీ నేతలు విమర్శించారు.
వాలంటీర్లు పూర్తిగా వైసీపీ కార్యకర్తలు కావడంతో వారి విషయంలో ప్రభుత్వం చివరికి వద్దని అనుకుంటోంది.ఇప్పటికే వైసీపీ ప్రభావం ఉన్న అధికారుల వల్ల ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తున్నాయి. వారందర్నీ ఏరి పక్కన పెట్టడానికి కూడా సమయం సరిపోవడం లేదు. ఇలాంటి సమయంలో వాలంటీర్లను పెట్టుకుంటే వారు చేసే నిర్వాకాలతో ప్రభుత్వం తల పట్టుకోవాల్సి వస్తుందన్న అంచనాతో ప్రభుత్వం ఇక వాలంటీర్ వ్యవస్థ వద్దని అనుకున్నట్లుగా తెలుస్తోంది. పొడిగింపు కోసం గత ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో ఎవరూ అధికారికంగా వాలంటీర్లుగా లేరు. దాంతో ప్రభుత్వం పని సులువు అయింది.