ఆంధ్రప్రదేశ్లో ఫైబర్ నెట్ స్కాం పేరుతో జరుగుతున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఒకప్పుడు రూ. రెండు వేల కోట్ల స్కాం అని.. లోకేష్ అని.. చంద్రబాబు అని ఎవర్నీ వదిలి పెట్టబోమని చేయగలిగినన్ని ఆరోపణలు చేశారు వైసీపీ నేతలు. అధికారంలోకి వచ్చిన తరవాత కూడా వివిధ రకాల కమిటీలు వేసి.. రెండున్నరేళ్ల పాటు ఆరోపణలే చేశారు. ఇటీవల వరకూ రూ. 2వేల కోట్ల స్కాం అని చెప్పి సీఐడీతో కేసు నమోదు చేయించి చివరికి రూ. 110 కోట్ల స్కాం అని చెప్పి కొంత మందిని విచారణకు పిలిచారు. ఫైబర్ నెంట్కు ఎండీగా వ్యవహరించిన ఐఆర్టీఎస్ అధికారి సాంబశివరావును అరెస్ట్ చేశారు. కానీ ప్రాథమిక ఆధారాలు కూడా చూపించలేకపోవడంతో ఒక్క రోజుకే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు ఫైబర్ నెట్లో స్కాం ఉందంటూ దొంగ కేసులు పెట్టడానికి స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కుట్ర చేశారని దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. తాము సీఐడీకి ఫిర్యాదు చేస్తామని .. పట్టించుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెబుతున్నారు. ఈ కేసు మొత్తం గౌరీశంకర్ అనే వ్యక్తి చుట్టూతిరుగుతోంది. అతనికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కీలక పదవి ఇచ్చారు. అయితే ఆ పదవి కోసం అతను సమర్పించినవి నకిలీ సర్టిఫికెట్లుగా తేలడంతో పదవిని రద్దు చేశారు. ఆ పదవిని సీఎం జగన్ స్వయంగా ఖరారు చేశారు. అతని కంటే ఎక్కువ అర్హతులున్నవారిని కూడా పక్కన పెట్టారు.
అయితే ఇప్పుడు గౌరీశంకర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే కేసు నమోదు చేశారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఫైబర్ నెట్ కాంట్రాక్ట్ ఇచ్చిన కంపెనీ తనను బెదిరించి సర్టిఫికెట్ తీసుకుందని ఈ గౌరిశంకర్ ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం అతన్ని బెదిరించి అతనితో అలా చెప్పించిందని దానికి సంబంధించి అన్నీ బయట పెడతామని.. ఈ నకిలీ నియామకం గుట్టు కూడా బయటపెడతామని అంటోంది. ప్రభుత్వ నియామకం వ్యవహారం వివాదాస్పదం కావడంతో ఎదురుదాడికి అన్నట్లుగా వైసీపీ నేతలు దర్శి ఎమ్మెల్యేను రంగంలోకి దింపారు. ఆయన కూడా ఫైబర్ నెట్ కాంట్రాక్ట్ కోసం పోటీపడ్డారు. తనకు అన్యాయం జరిగిందంటూ ఆయన ఆరోపణలు ప్రారంభించారు. వైసీపీ ఆఫీసులోనేఈ ఆరోపణలు చేశారు. ఓ వైపు సీఐడీ అధారాలు చూపించలకపోవడం.. తప్పుడు కేసు ను సీఎం జగన్ స్వయంగా పర్యవేక్షించారన్న టీడీపీ ఆరోపణలు పెరిగిపోవడంతో రాజకీయంగా ఎదురుదాడి మార్గాన్ని వైసీపీ ఎంచుకుందని భావిస్తున్నారు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కు ఫైబర్ నెట్ కాంట్రాక్ట్ దక్కకపోయినా తర్వాత పలు టెండర్లలో విజేతగా నిలిచారని.. టీడీపీ నేతలు వివరాలు బయట పెట్టారు.
మొత్తంగా ఫైబర్ నెట్ లో లేని స్కాం చూపించడానికి తప్పుడు ఫిర్యాదులు.. ఆరోపణలు.. సాక్ష్యాలు సృష్టించడానికి సీఎం జగన్ స్థాయిలో కుట్ర జరిగిందనడానికి టీడీపీ ఆధారాలు సేకరించినట్లుగా చెబుతోంది. ఈ అంశాన్ని ఇంతటితో వదలి పెట్టబోమని అంటున్నారు. టీడీపీ ఏమీ చేయలేదన్న భావనలో ఉన్న వైసీపీ.. రాజకీయంగా ఎదురుదాడి చేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.