క్రమశిక్షణకు మారుపేరైన పార్టీ మాదే అని తెలుగుదేశం నేతలు ఎప్పటికప్పుడు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అధినాయకత్వానికి విరుద్ధంగా నాయకులెవ్వరూ వ్యవహరించరు అంటారు. తేడా వస్తే ఏ స్థాయి నాయకులనైనా ఉపేక్షించేంది లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హూంకరించిన సందర్భాలను తరచూ చూస్తుంటాం. మరి, ఈ స్థాయిలో పార్టీలో క్రమశిక్షణ ఉందని అనుకుంటే… టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విషయంలో సీఎం ఎందుకు స్పందించడం లేదు..? పార్టీని ఇరకాటంలో పెట్టేసేలా జేసీ తీరు ఉంటుంటే క్రమశిక్షణ చర్యలేవీ..? మిగతా నేతల విషయంలో గరంగరం అయిపోయే సీఎం, జేసీ సోదరుల వరకూ వచ్చేసరికి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు..?
తాజా రాజీనామా డ్రామా విషయంలో కూడా హుటాహుటిన ముఖ్యమంత్రే స్పందించేశారు! జేసీ డిమాండ్ చేసినట్టే చాగల్లు జలాశయానికి గంటల వ్యవధిలో నీటిని విడుదల చేస్తున్నట్టు మంత్రి దేవినేని ఉమ ప్రకటించాల్సి వచ్చింది. అయితే, ఈ రాజీనామా డ్రామా వెనక అసలు కారణాలు వేరే అంటూ ఇప్పుడు కొన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో మంత్రి పరిటాల సునీత వర్గంతో జేసీకి మొదట్నుంచీ పడదు. నిజానికి, జేసీ సోదరులు తెలుగుదేశం పార్టీలోకి రావడం కూడా ఆమెకి పెద్దగా ఇష్టం లేదనే ప్రచారమూ జరిగింది. అయితే, పార్టీ భవిష్యత్తు దృష్ట్యా అందరూ కలిసి పనిచేయాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు బుజ్జగించి చెప్పడంతో ఆమె తటస్థంగా ఉండిపోతున్నారు. అయితే, అనంతపురంలో పరిటాల కుటుంబంతోపాటు ఆ సామాజిక వర్గం పట్టు పెరుగుతోందన్న గుర్రు జేసీకి ఎక్కువైందనీ, పార్టీ అధినాయకత్వం కూడా ఆ వర్గానికి చెందిన నేతల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తోందనే అభిప్రాయం జేసీలో ఉందంటున్నారు. అందుకే తన ఉనికిని చాటుకోవడం కోసమే రాజీనామా డ్రామాను తెర మీదికి తెచ్చారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
సరే, ఒకవేళ తన ఉనికి కోసమే ఇలాంటి చర్యలకు జేసీ దిగుతున్నాసరే.. ఆయన విషయంలో చంద్రబాబు ఎందుకు ఓర్పు ధోరణి ప్రదర్శిస్తున్నారు అనేదే అసలు ప్రశ్న..? దీనికి జవాబు కూడా ఉందిలెండి! టీడీపీ ఎంత కాదనుకుంటున్నా కమ్మ సామాజిక వర్గానికి కొమ్ము కాస్తుందనే అభిప్రాయం అలా ఉండిపోతూనే ఉంది. రాయలసీమ ప్రాంతంలో టీడీపీ పట్టు నిలుపుకోవాలంటే అక్కడ రెడ్డి సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకోవాలి. వైకాపాని సమర్థంగా ఎదుర్కోవాలంటే రాయలసీమ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలనే వ్యూహం ఎప్పట్నుంచో ఉన్నదే. సో.. సీమలో జగన్ ఎదుర్కోవాలంటే జేసీ దివాకర్ రెడ్డి సోదరుల అండ టీడీపీకి కచ్చితం అవసరం! కాబట్టే, జేసీ సోదరులు పార్టీకి ఇబ్బంది కలిగించే విధంగా ఎన్ని సందర్భాలు సృష్టిస్తున్నా.. ఉపేక్షిస్తూ వస్తున్నారని అనుకోవచ్చు.
నిజానికి, తెలుగుదేశం పార్టీకి తమ అవసరం చాలా ఉంది అనేది కూడా జేసీకి బాగా తెలుసు. అలాగని, జిల్లాలో తన పట్టు నిలుపుకోవాలంటే టీడీపీలో తన ఉనికి ఏంటనేది పరిటాల వర్గానికి తెలియజెప్పేలా ఏదో ఒకటి చేయాలన్నది జేసీ తాజా వ్యూహం కావొచ్చు. ఈ పరిస్థితిని జేసీ ఎప్పటికప్పుడు వాడుకుంటున్నారనే చెప్పాలి! సో.. పార్టీ భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా జేసీపై చంద్రబాబు కఠినంగానో, లేదా క్రమశిక్షణలో భాగంగానో ఏమీ అనే పరిస్థితి ఉండదనేది కొంతమంది అభిప్రాయం. గతంలో విశాఖ విమానాశ్రయంలో వీరంగం సృష్టించినా, రాజీనామా పేరుతో పార్టీ ఇమేజ్ కు ఇబ్బంది కల్గిస్తున్నా ఆయనపై ఎలాంటి అసంతృప్తినీ వెళ్లగక్కే పరిస్థితి ఉండదన్నమాట!