జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దుపై విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సీబీఐ కోర్టులో వాయిదా వచ్చిన ప్రతీ సారి సోషల్ మీడియాలో అత్యుత్సాహంగా కొందరు .. అదిగో బెయిల్ రద్దు.. ఇదిగో బెయిల్ రద్దు అని ప్రచారం చేస్తున్నారు. దీనిపై… వైసీపీ నేతలు సీఐడీకి కూడా ఫిర్యాదు చేశారు. అయితే.. ఆలోచనా పరులైన టీడీపీ నేతలు.. ఇతరులు మాత్రం జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కావాల్సిన అవసరం లేదంటున్నారు. ఆయన పూర్తి కాలం.. ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు. కాస్త తరచి చూస్తే అది నిజమేనని ఎవరికైనా అనిపించక మానదు.
ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. మరో రెండున్నరేళ్ల పాలన ఉంది. ఇప్పటికే ఆయనపాలనపై పథకాలు అందుకుంటున్న ఓటు బ్యాంక్ మినహా ఇతరుల్లో తీవ్ర అసంతృప్తి ఉందని అంచనాకు వస్తున్నారు. అదే సమయంలో ఓటు బ్యాంక్ కూడా.. తమ వద్ద పన్నుల రూపంలో వసూలు చేసిన సొమ్ములో కొంత భాగం తమకు ఇస్తున్నారనే భావనకు రావడం ఇప్పుడే ప్రారంభమైందని అంటున్నారు. పెరిగిపోయిన నిత్యావసర వస్తువుల రేట్లు… పెట్రోలు… ఇతర పన్నుల పెంపు అన్నింటిపై ప్రజలకు ఇప్పుడే చురుకుదనం తగులుతోందని చెబుతున్నారు. ఇక ఉద్యోగుల సంగతి చెప్పనవసరం లేదు. వారికి జీతాల గురించి కూడా గ్యారంటీలేకపోయింది. ఇంకో రెండు నెలలు ఆగితే ప్రభుత్వ పథకాలకు కూడా నిధులు ఉండవని అంటున్నారు. అదే సమయంలో.. చెల్లింపుల సంక్షోభం కూడా ఏర్పడుతుందని … ఏమీ చేయలేని స్థితికి ఏపీ సర్కార్ చేరుతుదంని అంచనా వేస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి పథకాలు నిలిపివేయాల్సిన పరిస్థితికి వస్తారని అంచనాతో ఉన్న టీడీపీ నేతలు… ఆయన బెయిల్ రద్దు అయితే మాత్రం .. మరింతగా సానుభూతి పొందుతారని.. ఆందోళనతో ఉన్నారు. గడ్డు పరిస్థితుల నుంచి ఆయన గట్టెక్కుతారని.. అలాగే ప్రజల్లో సానుభూతి పొందుతారని అంటున్నారు. జగన్ మరి కొంత కాలం జైల్లో ఉన్నంత మాత్రాన.. టీడీపీకి వచ్చే లాభమేమీ ఉండదంటున్నారు. ఇతర రాజకీయ విశ్లేషకులు అదే చెబుతున్నారు. జగన్ బయటే ఉండాలి.. ఇలాగే పాలన చేయాలి అని కోరుకుటున్నారు.