తెదేపా ప్రభుత్వం ఈ రెండేళ్ల పాలనలో రూ.1.30 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలపై తెదేపా నేతలందరూ చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్, మంత్రులు, పార్టీ నేతలు అందరూ దీనిపై స్పందించడం గమనిస్తే ఆ సంగతి అర్ధమవుతుంది. జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపనలన్నిటినీ తక్షణమే ఉపసంహరించుకొని, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని లేకుంటే, జగన్ పై చట్టపరంగా చర్యలు చేపడతామని పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ కె.రవీంద్ర కుమార్ హెచ్చరించారు. రాజకీయ దుర్దేశ్యంతోనే జగన్ నిరాధారమయిన ఆరోపణలు చేస్తున్నారని, ఆయన అక్రమంగా సంపాదించిన లక్ష కోట్లకి వడ్డీని కలుపుకొని రూ.1.30 లక్షల కోట్ల సంఖ్యని తయారు చేసి చెపుతున్నట్లుందని ఎద్దేవా చేసారు. ఒక అబద్ధాన్ని వందసార్లు గట్టిగా ప్రచారం చేస్తే నిజం అవుతుందని జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నట్లున్నారని రవీంద్ర విమర్శించారు.
అయితే జగన్మోహన్ రెడ్డి తన ఆరోపణలను ఆధారాలతో సహా పుస్తక రూపంలో ప్రచురించి, కేంద్ర మంత్రులకి, కేంద్రప్రభుత్వంలో వివిధ శాఖల ఉన్నతాధికారులకి కూడా పంచిపెడతానని చెపుతున్నప్పుడు, ఆయన దానిని ఉపసంహరించుకొని తెదేపాకు క్షమాపణలు చెప్పమని రవీంద్ర డిమాండ్ చేయడం చాలా అసంబద్దంగా ఉంది. జగన్ తన ఆరోపణలకు కట్టుబడి ఉన్నప్పుడు, తెదేపా నేతలు ఇంకా ఇటువంటి హెచ్చరికలతో కాలక్షేపం చేయడం అంటే ఆ ఆరోపణలని వారు ఎంతో కొంత మేర అంగీకరిస్తున్నట్లే అవుతుంది. అయినా ఇప్పుడు రవీంద్రతో సహా తెదేపా నేతలు అందరూ జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్ల అక్రమాస్తులు కూడా బెట్టారని నిత్యం విమర్శిస్తున్నప్పుడు, ఆయన తిరిగి అవే విమర్శలు చేస్తే తెదేపా ఉలికిపడటం చాలా విచిత్రంగానే ఉంది. ఒకవేళ తెదేపా నేతలకు ఆ ఆరోపణలు ఆమోదయోగ్యం కానట్లయితే, ఈవిధంగా తాటాకు చప్పుళ్ళు చేయడం మాని, తక్షణం ఆ ఆరోపణలపై న్యాయస్థానంలో సవాలు చేయడమో లేకపోతే సిబీఐ విచారణకు ఆదేశించో తమ నిజాయితీని నిరూపించుకొంటే బాగుంటుంది కదా!