మోకాలికీ బోడిగుండుకీ ముడేయమంటే ఇదే..! గురివింద గింజ తన నలుపెరుగనట్టు మాట్లాడటం అంటే అచ్చంగా ఇదే..! ప్రతిపక్ష నేత జగన్ మీద ఎప్పుడుపడితే అప్పుడు దుమ్మెత్తి పోసేందుకు టీడీపీలో ఒక బ్యాచ్ సిద్ధంగా ఉంటుందని అందరికీ తెలిసిందే. ఇప్పుడు రాజధాని గ్రామాల్లో జగన్ పర్యటిస్తుంటే తెలుగుదేశం నాయకులకు కంటగింపుగా ఉంది. రాజధాని ప్రాంతమంటే టీడీపీ ఇలాఖా అనేది వారి ఉద్దేశం కావొచ్చు. సరే.. కడుపుమంట ఏదైనా సరే జగన్ పర్యటనపై టీడీపీ చేస్తున్న తాజా విమర్శ ఏంటంటే… రాజధాని ప్రాంత గ్రామాల్లోకి జగన్ వెళ్లడం వల్ల భూముల ధరలు తగ్గిపోతాయట! మంత్రి పత్తిపాటి పుల్లారావు ఇదే సూత్రీకరించారు. దీన్నే చినబాబు నారా లోకేష్ కూడా తనదైన రాజముద్ర వేసి సైద్ధాంతికరించారు. అయినా.. భూముల ధరలు పెంచడం తగ్గించడం ప్రతిపక్ష నాయకుడి చేతుల్లో ఉంటుందా చెప్పండీ. ఆ మాట కొస్తే రాజధాని ప్రాంత భూముల ధరలపై ప్రభావం చూపేలా వ్యాఖ్యానించిందీ లీకులు ఇచ్చిందీ సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదా!
ఫలానా ప్రాంతంలో రాజధాని రాబోతోందనీ ఏ ముఖ్యమంత్రి అయినా లీకులు ఇస్తారటండీ..? చంద్రబాబు గతంలో అలాంటి ఊహాగానాలను లీక్ చేయడంతోనే విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల భూముల ధరలకు ఉన్నపళంగా రెక్కలొచ్చాయి. కోట్లకు కోట్లు నల్లధనంతో రాజధాని పరిసర ప్రాంతాల్లో వందల వేల ఎకరాలను ఎవరు సొంతం చేసుకున్నారో ఓపెన్ సీక్రెట్! ఓపక్క నల్లధనంపై అద్భుత పోరాటం చేస్తున్నామని ప్రచారం చేసుకునే చంద్రబాబు… భారీ ఎత్తున భూ కొనుగోళ్లకు అధికార పార్టీ నేతలు తెచ్చిన సొమ్ము రంగేంటో మాట్లాడరేం..?
నాణానికి ఇంకోవైపు మాట్లాడుకుంటే… భూముల ధరలు పెరగడం వల్ల రైతులు భారీగా లాభపడ్డారని చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి కదా! ఒకవేళ అంతంత లాభాలు వచ్చేస్తుంటే… కొంతమంది రైతులు తమ భూములు ఎందుకు ఇవ్వడం లేనట్టూ..? జగన్ వద్దన్నారని ఇవ్వడం మానేశారా..? జగన్ కోసం సొంత లాభాన్ని వదిలేసుకున్నారా..? జగన్ కోసం త్యాగాలు చేస్తున్నారా..? ఈ క్రమంలో రైతుల సమస్య కోణాన్ని ఎందుకు విస్మరిస్తున్నట్టు..?
రాజధాని నిర్వాసిత ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ పర్యటిస్తే… బలవంతపు సేకరణ లేదని ప్రభుత్వం చెబుతుంది. రైతులు స్వచ్ఛందంగా ఇస్తున్నారని తెలుగుదేశం నేతలు చెబుతారు. అదే ప్రతిపక్ష నేత జగన్ ఆ గ్రామాలకు వెళ్లగానే భూముల ధరలు తగ్గిపోతాయట! రైతులే భూములు ఇవ్వాలని డిసైడ్ చేసుకుంటే జగన్ వద్దని చెప్పినా ఆగుతారా..! జగన్ రైతుల వద్దకు వెళ్లడం వారికి తెలుగుదేశం నేతలకు ఇష్టం లేదు. రైతుల్లో జగన్ పట్టు పెరుగుతూ ఉండటం వారికి నచ్చడం లేదు. ఇదే బాటమ్ లైన్. అంతే… ఆ అయిష్టాన్ని ప్రదర్శించేందుకు ఇలా ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేసేయడం తెలుగుదేశం నేతలకు అలవాటైపోయింది.