తెలుగుదేశం పార్టీకి విరాళాలివ్వాలనుకునేవారి కోసం ప్రత్యేక వెబ్సైట్ను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు. tdpforandhra.com వెబ్ సైట్ ద్వారా మొదట తానే 99,999 రూపాయలు విరాళం ఆన్ లైన్ ద్వారా జమ చేశారు. ఈ వెబ్ సైట్ లో రూ. 99 నుంచి రూ. 99, 999 వరకు వివిధ డినామినేషన్లలో విరాళం ఇచ్చే అవకాశం ఉంది.
పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తలు నుంచే విరాళాలు సేకరిస్తున్నారు. వ్యాపారాల కోసం చందాలు ఇచ్చే వారి దగ్గర నుంచి టీడీపీ ఎలాంటి డొనేషన్లు తీసుకోకూడదని నిర్ణయించింది. ఎన్నారైలు కూడా ఈ వెబ్ సైట్ ద్వారా టీడీపీకి విరాళాలు అందించవచ్చునని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. విరాళం ఇచ్చిన వారికి రశీదు కూడా జనరేట్ అవుతుందని.. డిజిటల్ కరెన్సీ ద్వారా ట్రాకింగ్ సులువు అవుతుందన్నారు.
రాష్ట్ర ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలని చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో ప్రజల భాగస్వామ్యం ఉండాలన్నారు. వైసీపీ పాలనలో ఒక్కడే బాగుపడ్డాడని..ఐదు కోట్ల మంది ఆంధ్రులు నష్టపోయారన్నారు.