ఈ శీర్షిక చూడగానే ఎవరికైనా ఇట్టే అర్థమౌపోతుంది… ఇది వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్య అని! ట్విట్టర్ లో ఎప్పుడూ ఏదో ఒక కామెంట్ చేయడం ఆయనకి అలవాటు కదా! అదే క్రమంలో తాజాగా ఆయన చేసిన ట్వీట్లలో ఇలాంటిది ఒకటుంది. ఆయన ఏమంటారంటే…. ఎన్నికల ఫలితాల అనంతరం తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఆ పార్టీ ముక్కలు కాబోతోందని చెప్పారు. టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ ఆశయాలకూ సిద్ధాంతాలకు అనుగుణంగా చంద్రబాబు తీరు ఉండటం లేదనీ, దీంతో ఆ పార్టీకి చెందిన చాలామందిలో చంద్రబాబుపై అసంతృప్తి ఉందనీ, కాబట్టి టీడీపీతో తిరుగుబాటు వచ్చే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. పార్టీలో ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టే, మహానాడు కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు వాయిదా వేసుకున్నారని ఆయన చెప్పారు! ఎన్నికల ఫలితాల తరువాత ఇలాంటి వింతలు టీడీపీలో చాలాచాలా జరగబోతున్నాయని అభిప్రాయపడ్డారు.
నిజానికి, మహానాడు వాయిదా వేసింది ఎందుకంటే… ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత, వరుసగా దాదాపు ఓ పదిరోజులపాటు రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరించాల్సిన సమయం. జాతీయ స్థాయిలో కూటమి, రాష్ట్రంలో వ్యవహారాలపై పార్టీ నేతలంతా బిజీబిజీగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ టైంలో ఏ ప్రధాన పార్టీలోనైనా ఇలాంటి వాతావరణమే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మహానాడు నిర్వహించే కంటే… కొద్దిరోజులు వాయిదా వేసుకుంటే మేలు అనేది ఆ పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది. అంతేగానీ, టీడీపీ అంతర్గత కలహాలున్నాయనీ, పార్టీ ముక్కలైపోయే పరిస్థితి ఉందని ఒక్క విజయసాయి రెడ్డికి తప్ప, ఇలాంటి కారణం ఎవ్వరికీ కనిపించలేదు. అధికారంలో ఉన్నా లేకపోకపోయినా మహానాడు నిర్వహించుకోవడం ఆ పార్టీకి ఒక ఆనవాయితీ. ఇంకోటి, తెలుగుదేశం పార్టీకి నాయకత్వ లేమి లేదు. విజయసాయి చెప్తున్నవి ఊహాజనిత పరిస్థితులు!
ఒక పార్టీ మీద ఈ స్థాయిలో ట్వీట్లు చేస్తూ, ఎన్నికల ఫలితాల తరువాత ఫలానా పార్టీ ఏదో అయిపోతోందని విజయసాయి వ్యాఖ్యానించడం వల్ల ఎవ్వరికైనా ఉపయోగం ఉందా? ఎన్నికల ఫలితాల తరువాత, టీడీపీ అధికారంలోకి వచ్చిందే అనుకుందాం. ఇప్పుడీ ట్వీట్లను ఫాలో అవుతూ, వాటిని చూస్త ఆనందిస్తున్న వైకాపా అభిమానులు విజయసాయి రెడ్డి గురించి ఆ తరువాత ఏమనుకుంటారు? ఇలాంటి అవాకులూ చవాకులూ మాట్లాడుతూ పోతే… రేప్పొద్దున్న, ఆయన చెప్పిన మాటల్లో నిజం ఉండదు అనే పరిస్థితి ఆ పార్టీ అభిమానుల్లోనే వస్తే పరిస్థితి ఏంటి? ఇలాంటి ట్వీట్లు చేసేముందు ఆయన ఈ తరహా ఎప్పుడూ ఆలోచిస్తున్నట్టు లేదు.