ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం చేసిన అన్యాయం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయం అవుతోంది. గత పార్లమెంటు సమావేశాల్లో భాజపాపై మిత్రపక్షమైన టీడీపీ తిరగబడటంతో చర్చ మొదలైంది. ఇతర పార్టీల నుంచి టీడీపీకి కొంత మద్దతు వచ్చింది. ఇప్పుడు జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టేందుకు అన్ని పార్టీలకూ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాస్తున్నారు. ఆంధ్రా ప్రయోజనాల దృష్ట్యా ఇది అత్యవసరం. రాజకీయంగా చూసుకున్నా ఇది జాతీయ స్థాయిలో సమీకరణాల మార్పునకు పునాదిగా విశ్లేషకులు చూస్తున్నారు. భాజపా వ్యతిరేక శక్తులకు చంద్రబాబు నాయుడు నాయకత్వం వహిస్తారా అనే ఊహాగానాలు ఇదివరకే వచ్చాయి. వాటికి బలం చేకూర్చే దిశగా తాజా పరిణామాలు ఉండబోతున్నాయి. ఇప్పుడీ ఆహ్వాన లేఖల్ని ఆ దిశగా పడిన మరో ముందడుగుగా కూడా చూడొచ్చు.
భావసారూప్యత గల పార్టీలను కలుపుకుంటూ ప్రస్తుతం ఏపీ ప్రయోజనాల కోసం పోరాటం చేయడంతోపాటు, వచ్చే ఎన్నికల నాటికి జాతీయ స్థాయిలో ప్రభావవంతమైన ప్రత్యామ్నాయ వేదికను తయారు చేసుకోవాలనేది కూడా అంతర్గతంగా చంద్రబాబు వ్యూహం అనిపిస్తోంది. ఎలాగూ భాజపాతో తెగతెంపులు తప్పవు అనేట్టుగానే పరిస్థితి ఉంది. అలాంటప్పుడు, జాతీయ స్థాయిలో మరో పార్టీతో కలిసి పనిచేయాల్సి వస్తుంది. కాంగ్రెస్ తో కలవడం అనేది సాధ్యం కాదు. కాబట్టి, ఇతర ప్రాంతీయ పార్టీలతో కలసి ఒక ఉమ్మడి వేదికను ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు తాజా పరిస్థితులు ప్రాతిపదికగా నిలిచే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత వ్యూహాత్మంగా తాము అడుగులు వేస్తున్నామని టీడీపీ కూడా చెప్పడం లేదు. కేవలం ఏపీ సమస్యలకు కేంద్రం నుంచి పరిష్కారం రాబట్టడమే ప్రస్తుత ఐక్యతా వ్యూహం. అలాగని, ఇప్పటికిప్పుడు భాజపా స్పందించేస్తుందన్న నమ్మకమూ ఎవ్వరికీ లేదు. కాబట్టి, ఒకవేళ భాజపా మొండివైఖరి మరింత పెరిగితే… ఎన్నికల వరకూ ఏపీ ప్రయోజనాల విషయమై తాత్సారం చేస్తే, అప్పుడు చంద్రబాబు మరోసారి జాతీయ స్థాయిలో క్రియాశీల పాత్ర పోషించే వ్యూహాలకు పదులునుపెట్టే అవకాశం ఉంది. దానికి పునాదిగా ప్రస్తుత పరిస్థితులు ఉపయోగపడతాయి.
పైగా, ప్రాంతీయ పార్టీలపై జాతీయ పార్టీల అణచివేత ధోరణి అనేది ఇటీవలి కాలంలో స్పష్టంగా కనిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్, లేదంటే మరోసారి భాజపాలే అధికారంలోకి వచ్చేవి. కాబట్టి, ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమైతే తప్ప.. తమ ప్రాంతాల ప్రయోజనాలను కాపాడుకోలేని పరిస్థితి వస్తుందేమో అనే అభద్రతను గడచిన నాలుగేళ్లలో భాజపా సృష్టించింది. ప్రస్తుతం ఏపీ ఎదుర్కొంటున్న సమస్యే రేప్పొద్దున్న తమిళనాడుకు రాదని భరోసా ఏదీ, పశ్చిమ బెంగాల్ లో ఉండదన్న ధీమా ఏదీ..? జాతీయ స్థాయిలో కూడా ప్రాంతీయ పార్టీల ఐక్యతకు కావాల్సిన ఆవశ్యక వాతావరణం ఉంది. కాబట్టి, అలాంటి కూటమి తెరమీదికి వచ్చే అవకాశాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. గతంలో వినిపించిన కథనాలకు అనుగుణంగానే ఆ కూటమికి చంద్రబాబు నాయకత్వం వహించే అవకాశాలూ ఉన్నాయి. రాష్ట్ర తక్షణ ప్రయోజనాలే టీడీపీ అజెండా అయినప్పటికీ, అంతర్లీనంగా దీర్ఘ కాలిక ప్రయోజనాలకు కావాల్సిన పునాదుల్ని కూడా ఈ సందర్భంగా వేసుకుంటున్నారనే చెప్పాలి.