ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అగ్రనేతల్ని ఎవరైనా ప్రజల్లో చూసి ఉంటారా..? ప్రభుత్వంపై ఎప్పుడైనా ఓ చిన్నపోరాట కార్యక్రమం పెట్టడం చూశారా..?. సోము వీర్రాజు, కన్నా లక్ష్మినారాయణ లాంటి… పేరు గొప్ప నేతలు.. జిల్లాల పర్యటనలకు వెళ్లి.. ఆయా చోట్ల ప్రెస్మీట్లలో మాట్లాడి వస్తారు. అంతకు మించి వారికి ఓ పార్టీ కార్యక్రమం చేపట్టే స్టామినా ఉండదు. కానీ పెద్ద పెద్ద ప్రకటనలు చేసేస్తూ ఉంటారు. ముఖ్యంగా.. తాము తమ రాష్ట్రంలో.. చేయాల్సినదాని కన్నా… ఎక్కువే చేస్తున్నామని.. ఢిల్లీ స్థాయి నేతల దగ్గర చెప్పుకునేందుకు… మాత్రం.. ఎక్కడ లేని ఉత్సాహం చూపిస్తూంటారు. అది నిన్న అమిత్ షా వద్ద జరిగిన సమావేశంలో మరోసారి తేట తెల్లమయిపోయింది. ఇన్ని రోజులు ఏపీలో ఎన్ని బూత్ కమిటీలు నియమించారని అమిత్ షా అడిగితే.. నోరెత్తలేని స్థితిలో.. భేటీ ముగించుకుని బయటకు వచ్చి మాత్రం కోతలరాయుడు కబుర్లు చెప్పారు.
అమిత్ షాతో సమావేశం ముగిసిన తర్వాత.. రాబోయే ఎన్నికల గురించి ఏం మాట్లాడుకున్నారు..? బలం పెంచుకునేందుకు అమిత్ షా ఏం ఉపదేశించారు..? అనే అంశాలు ఎవరైనా మీడియాకు వినిపిస్తారు. కానీ బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్సోము వీర్రాజు మాత్రం.. రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో రసీదు కట్టి ప్రెస్‌మీట్ పెట్టి రోజూ చెప్పే మాటలే వినిపించారు. చంద్రబాబుపైనే విమర్శలు చేశారు.
చంద్రబాబు కేవలం ప్రధాని మోదీపై విమర్శలు చేయడమే ఆయన శైలిగా మార్చుకున్నారని మండిపడ్డారు. మోదీ కంటే ఆయనే సీనియర్‌గా చెప్పుకోవడం చంద్రబాబుకు పరిపాటిగా మారిందన్నారు. మోదీకి చంద్రబాబుకి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు. బీజేపీ సహకారం లేకుండా రాష్ట్రంలో ఏ ప్రభుత్వమూ ముందుకెళ్లదని.. చంద్రబాబు కేవలం 30 స్థానాలకు పరిమితం అయ్యేలా చేస్తామని శపథం చేశారు. ఢిల్లీకి వెళ్లి పార్టీ తరపున మీటింగ్ పెట్టి.. తాము ఇన్ని స్థానాలు గెలుచుకునే దిశగా ముందుకెళ్తామని.. చెప్పుకుంటారు కానీ.. పక్క పార్టీని కొన్ని స్థానాలకే పరిమితంచేస్తామని చెప్పే నేతలు ఎవరుంటారు..? ఒక్క ఏపీ బీజేపీ నేతలు తప్ప..!
నిజానికి సమావేశంలో..అమిత్ షా అసెంబ్లీ మీద ఆశలు వదిలేసుకుని కేవలం పార్లమెంట్ స్థానాలపై దృష్టి పెట్టమని హితోపదేశం దేశారు. కొన్ని ప్రత్యేకమైన ప్రణాళికలు వివరించారు. ఏపీలో జమిలీ ఎన్నికలు వస్తాయి. ఇప్పటికే బీజేపీ, వైసీపీ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని… అసెంబ్లీకి సంబంధించినంత వరకూ.. వైసీపీకి.. పార్లమెంట్‌కు సంబంధించినంత వరకూ… బీజేపీకి సహకరించాలన్న ఒప్పందం ఇరు పార్టీల మధ్య జరిగిందన్న ప్రచారం జరుగుతోంది. దీనికి తగ్గట్లుగానే కొన్ని ప్రత్యేకమైన లోక్ సభ నియోజకవర్గాలను మాత్రమే దృష్టి పెట్టాలని.. అమిత్ షా… ఏపీ నేతలకు దిశానిర్దేశం చేసి పంపించారు.