2021లో జరిగిన కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓటమితో ఆ పార్టీ పని అయిపోయిందని ఎన్నో అవహేళనలు.. సొంత ఇలాకా కుప్పంలోనే పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేని చంద్రబాబు.. తిరిగి సీఎం అవుతారా ? అని ఎన్నో పెదవి విరుపులు. వెరసి మూడేళ్లకే మంచి కం బ్యాక్ తో వైసీపీని మట్టికరిపించిన టీడీపీ, పడిలేచిన కెరటంలా రాజకీయ రంగంలో కొత్త చరిత్రను లిఖించుకుంది.
తాజాగా జరిగిన కుప్పం మున్సిపల్ ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఘన విజయం సాధించారు. గతేడాది చైర్మన్ గా ఉన్న సుధీర్ రాజీనామా చేయడంతో అక్కడ బైఎలక్షన్ అనివార్యమైంది.ఈ ఎన్నికల్లో టీడీపీ కౌన్సిలర్ సెల్వరాజ్ చైర్మనుగా గెలుపొందారు. ఆయనకు మొత్తం 16 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థికి 9 ఓట్లు పడ్డాయి.
2021 మున్సిపల్ ఎన్నికల్లో విజయంతో ఎక్కడ లేని గర్వంతో విర్రవీగిన ఫ్యాన్ పార్టీ.. ఏకంగా వైనాట్ 175అంటూనే, వై నాట్ కుప్పం అంటూ కూతలు కూసింది. కానీ, రెండేళ్లు తిరిగేసరికి వైసీపీకి ప్రజలు కీలెరిగి వాత పెట్టారు. వై నాట్ కుప్పం అంటూ ప్రగల్భాలు పలికిన వైసీపీ నేతలు ఒకరిద్దరూ మినహా అందర్నీ జనం ఎంచక్కా ఇంటికి పంపించారు.
ఆ ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డిలు కుప్పంలోనే మొహరించి ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారు. ప్రలోభాలకు గురి చేశారు. ఈ ఎన్నికను 2024 ఎన్నికలకు సెమి ఫైనల్ గా అభివర్ణించారు. అయినా 2024 ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. ఎక్కడైతే గెలుపును చూసి వై నాట్ 175అన్నారో మళ్లీ అదే కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిపాలైంది వైసీపీ.
ఓటమి ఎదురైన చోటే గెలుపుతో టీడీపీ జెండా కుప్పం మున్సిపల్ కార్యాలయంపై సగర్వంగా రెపరెపలాడుతోంది.