తెలుగుదేశంపార్టీ అనూహ్యమైన రికార్డు సృష్టించింది. కోటిమంది కార్యకర్తల పార్టీగా ఘనత సాధించింది. ఓ ప్రాంతీయ పార్టీకి ఈ స్థాయిలో సభ్యులు ఉండటం చిన్న విషయం కాదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లు కోటి యాభై మూడు లక్షలు. ఇప్పుడు కోటి మంది సభ్యత్వం తీసుకున్నారు. ఓట్లు వేసిన వాళ్లంతా సభ్యత్వం తీసుకోవాలన్న రూలేం లేదు కానీ. ఈ సారి ఓట్లు వేయని సామాన్య ప్రజలు కూడా టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. నారా లోకేష్ చొరవతో ఇది సాధ్యమయింది.
తెలుగుదేశం పార్టీ వ్యవహారాలను నారా లోకేష్ చాలా ప్లాన్డ్గా చక్కబెడుతున్నారు. కోటి మందికార్యకర్తల పార్టీగా తీర్చిదిద్దడానికి ఆయన వేసిన ప్రణాళికలు భిన్నంగా ఉన్నాయి. ప్రతి కార్యకర్త సంక్షేమానికి భరోసా ఉంటుందని సందేశం పంపారు. ఐదు లక్షల ప్రమాద బీమాను కల్పించారు. ఈ ప్రమాద బీమా ఉండాలంటే ఏడాదికి కనీసం ఐదు వేలు చెల్లించాలి. కానీ వంద రూపాయలు పెట్టి సభ్యత్వం తీసుకుంటేనే ఈ ప్రమాద బీమా లభిస్తుంది. నారా లోకేష్ ఇప్పటికే యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్, ప్రాగ్మ్యాటిక్ ఇన్స్యూరెన్స్ బ్రోకింగ్ ప్రతినిధులతో అవగాహన ఒప్పందం చేసుకున్నారు.
ఒక్క ప్రమాద బీమా విషయంలోనే కాదు.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం నారా లోకేష్ చాలా ఏర్పాట్లు చేశారు. బయటకు రాలేనంత కష్టాల్లో ఉన్న వారిని బయటపడేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ తరపున ప్రత్యేకంగా కార్యకర్తల సంక్షేమ ఫండ్ కూడా ఉంది. కార్యకర్తలను పట్టించుకునే పార్టీగా ఉండటం వల్లనే .. టీడీపీకి కోటి మంది సభ్యులు వచ్చారు. ఇతర పార్టీలు ఇలాంటి సభ్యత్వాలను చేయడానికి సాహసించే పరిస్థితి లేదు.