వినాయకచవితి పండుగ నిర్వహణపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో ఇతర పార్టీలు పొలిటికల్ అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ ధర్నాలు నిర్వహించగా..తెలుగుదేశం పార్టీ మరో అడుగు ముందుకేసింది. తాము బహిరంగంగా మండపాలు ఏర్పాటు చేసి పండుగ నిర్వహించి తీరుతాం ఏం చేసుకుంటారో చేసుకోండని ఆ పార్టీ నేతలు ఆ పార్టీ నేతలు హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ కార్యక్రమాలు, సొంత నేతల జయంతులు, వర్థంతులకు రాని ఇబ్బంది వినాయకచవితికే వచ్చిందా అంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన 175 నియోజకవర్గాల ఇంచార్జ్‌లు ఒక్కొక్కరు ప్రత్యేకంగా ఒక్కో లేఖను సీఎం జగన్‌కు పంపారు.
రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని వినాయక చవితి వేడుకలకు అలాంటి ఆలోచనలు చేయడం కరెక్ట్ కాదని టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్‌లు సీఎంకు లేఖలో హితవు పలికారు. బీజేపీ, టీడీపీ పార్టీలే కాకుండా జనాల్లోనూ ప్రత్యేకంగా వినాయక చవితికే ఎందుకు ఆంక్షలు పెడుతున్నారన్న ఆలోచన పెరుగుతోంది. మరో వైపు ప్రభుత్వం ఆంక్షలు విధించిందన్న కారణంగా కొన్ని చోట్ల ప్రభుత్వ ఉద్యోగులు ఓవరాక్షన్ చేశారు. అమ్మకాలకు రెడీ చేసిన విగ్రహాలను మున్సిపల్ వ్యాన్లలో తరలించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం విమర్శలు వెల్లువెత్తాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యక్రమాలను కొన్ని వేల మందితో పండుగల్లా నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను కూడా అలాగే నిర్వహిస్తారు. అలాగే ఏపీలో ఎక్కడా ఏ విషయంలోనూ కోవిడ్ రూల్స్ అమలవుతున్నాయని ఎవరూ అనుకోరు. కానీ అన్నింటిలాగే.. కోవిడ్ నిబంధనల ప్రకారం పండుగలు జరుపుకోవాలని ప్రభుత్వం అవకాశం ఇవ్వకుండా అసలు మండపాలే పెట్టవద్దని అనడాన్ని రాజకీయ పార్టీలు అడ్వాంటేజ్‌గా తీసుకున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందో లేదో కానీ పార్టీలుమాత్రం తాము మండపాలు పెట్టి తీరుతామని ప్రకటిస్తున్నాయి.