తెలంగాణాలో పాలమూరు ప్రాజెక్టు, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ పనులను వైకాపా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డికి చెందిన సంస్థ చేస్తోందని రేవంత్ రెడ్డి తదితర తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. వారి ఆరోపణలను పెద్దిరెడ్డి ఖండించడమే కాకుండా, ఆ ప్రాజెక్టులను ఒక ప్రముఖ తెదేపా నేతకి చెందిన నవయుగ కంపెనీయే చేస్తోందని ఆరోపించారు. తమ సంస్థలు దేశ,విదేశాలలో పనులు చేస్తున్న మాట వాస్తవమే కానీ తెలంగాణాలో మాత్రం ఒక్క పని కూడా చేపట్టలేదని పెద్దిరెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా నవయుగ సంస్థకి చెందిన హెలికాఫ్టర్లో తిరగడం అందరికీ తెలుసని పెద్దిరెడ్డి అన్నారు. తెదేపా నేతకి చెందిన ఆ సంస్థకి తెలంగాణా ప్రాజెక్టుల కాంట్రాక్టులు దక్కినందునే తెదేపా నేతలు ఎవరూ వాటిని గట్టిగా వ్యతిరేకించడం లేదేమో? అని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తమ సంస్థలు వ్యాపారాలు చేసి డబ్బు సంపాదిస్తుంది తప్ప తెదేపా నేతల్లాగా రాజకీయాల ద్వారా డబ్బు సంపాదించదని ఆయన తెదేపా నేతలకు చురకలు వేశారు. తమ సంస్థ చంద్రబాబు నాయుడు స్వంత నియోజక వర్గంలో కూడా రోడ్ల నిర్మాణ పనులు చేస్తోందని, ఆ విషయం ఆయనకీ తెలుసని అన్నారు.
మిథున్ రెడ్డి సంస్థకు తెలంగాణా ప్రభుత్వం రూ.6000 కోట్ల విలువగల పనులు అప్పగించిందని రేవంత్ రెడ్డి ఆరోపిస్తుంటే, తమ సంస్థలు అసలు తెలంగాణాలో ఏ పనులు చేపట్టలేదని పెద్దిరెడ్డి చెపుతున్నారు. ఎవరిమాట నిజమో తేల్చి చెప్పగల తెరాస ప్రభుత్వం వారి వాదోపవాదాలలో తలదూర్చకపోవడం విశేషమే.