ఈరోజు మహిళా దినోత్సవం కనుక ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మహిళల సమస్యల గురించే చర్చ జరుగుతుందని వాటికి సభలో సభ్యులు మంచి పరిష్కారాలు సూచిస్తారని అందరూ ఆశిస్తే అదేమీ అత్యాశ కాదు. సభలో మహిళల గురించే చర్చ సాగింది. కానీ అది కూడా అధికార, ప్రతిపక్షాలు ఒకదానినొకటి విమర్శించుకోవడానికి ఒక ఆయుధంగానే ఉపయోగపడింది. సభలో సభ్యుల మధ్య జరిగిన ఈ చర్చలు చూసినట్లయితే అది అర్ధం అవుతుంది.
మొదట మంత్రి రావెల కిషోర్ బాబు పుత్రరత్నం సుశీల్ ప్రస్తావన వచ్చింది. దానిపై జగన్ స్పందిస్తూ “నడి రోడ్డు మీద ఒక వివాహిత ముస్లిం మహిళ పట్ల సభ్యంగా ప్రవర్తించినందుకు ప్రజలు మంత్రిగారి కొడుకుని చితకబాది పోలీసులకి అప్పగించినా ముఖ్యమంత్రిగారు ఆయనని ఇంతవరకు మంత్రి పదవి నుండి తప్పించలేదు. పైగా మంత్రిగారి కొడుకు రోడ్డు మీద మహిళలతో అనుచితంగా ప్రవర్తిస్తే దానికీ నాదే బాధ్యత అంటున్నారు,” అని అన్నారు.
దానికి మంత్రి రావెల సమాధానం: “ఫాతిమా నా కూతురు వంటిది. మహిళల పట్ల ఎవరు తప్పుగా వ్యవహరించినా వారిని చట్ట ప్రకారం శిక్షించవలసిందే. నా కుమారుడుని నేనే పోలీసులకి అప్పగించి తప్పు చేస్తే శిక్షించమని చెప్పాను. గతంలో పరిటాల రవిని నువ్వు (జగన్) సూట్ కేసు బాంబుతో హత్య చేయడానికి ప్రయత్నిస్తే, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మీ తండ్రి రాజశేఖర్ రెడ్డి నిన్ను వెనకేసుకు రాలేదా?” అని ప్రశ్నించారు.
ఈ కేసులో జగన్ ఫాతిమాకి జరిగిన అవమానం కంటే ఆ కారణంగా రావెల మంత్రి పదవి ఊడలేదనే బాధపడుతున్నట్లుంది. దానికి రావెల ఇచ్చిన సమాధానంలో ఫాతిమా తన కూతురు వంటిదని చెపుతూనే రాజశేఖర్ రెడ్డి ప్రస్తావన చేసి తన కొడుకుని వెనకేసుకు రావడం తప్పు కాదనట్లు మాట్లాడటం గమనిస్తే ఆయన ఇప్పటికీ జరిగిన దానికి పశ్చాతాపపడటం లేదని అర్ధమవుతోంది.
తెదేపా ప్రభుత్వానికి మహిళల పట్ల ఏమాత్రం గౌరవం లేదని చెప్పడానికి ముసునూరు తహసిల్దార్ వనజాక్షిపై తెదేపా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చెయ్యి చేసుకోవడం, అంగన్ వాడీ మహిళా ఉద్యోగులను దూషించడం, నాగార్జున యూనివర్సిటీ రిషితేశ్వరి ఆత్మహత్య, వైకాపా ఎమ్మెల్యే రోజాని ఏడాదిపాటు సభ నుండి సస్పెండ్ చేయడం, విజయవాడ కాల్ మనీ రాకెట్ వంటి వాటి గురించి జగన్ ప్రస్తావించి, అధికార పార్టీ నేతలే ఈ తప్పులన్నీ చేస్తున్నా ముఖ్యమంత్రి ఎవరిపైనా చర్యలు తీసుకోకుండా మళ్ళీ వారినే వెనకేసుకువస్తుంటారని జగన్ ఎద్దేవా చేసారు.
దానికి చింతమనేని జవాబు: వనజాక్షిపై నేను దాడి చేసి ఉండి ఉంటే ఆమె నాపై పోలీస్ కేసీఆర్ పెట్టి ఉండేది కదా? కానీ ఆమె నాపై ఎటువంటి పిర్యాదు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి నాపై లేనిపోని నిందలు వేసి అసత్యప్రచారాలు చేస్తూ సభను తప్పు ద్రోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
చంద్రబాబు డ్వాక్రా సంఘాల మహిళలను కూడా మోసం చేసారని జగన్ ఆరోపించారు. ఒక మహిళా ఎమ్మెల్యే (రోజా) ని సస్పెండ్ చేసిన ఘనత కూడా ఆయనదేనని విమర్శించారు.
వారి వాదోపవాదనలు విన్న తరువాత రాష్ట్రంలో మహిళలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? వాటి పరిష్కారానికి మన ప్రజా ప్రతినిధులు చట్టసభలలో ఏమి పరిష్కారం చూపించగలిగారు? అని ప్రశ్నించుకొంటే ఏమీ లేదనే సమాధానం వస్తుంది.